సంక్షోభంలో కమల్నాథ్ ప్రభుత్వం: గుర్గావ్ హోటల్లో ఎమ్మెల్యేలు

By telugu teamFirst Published Mar 4, 2020, 10:09 AM IST
Highlights

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. ఎనిమిది మంది శాసనసభ్యులను బిజెపి నేతలు గురుగ్రామ్ లోని హోటల్ కు తరలించినట్లు కాంగ్రెసు నేతలు ఆరోపిస్తున్నారు.

భోపాల్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. ప్రభుత్వాన్ని కూల్చేందుకు బిజెపి నాయకులు కుట్ర చేస్తున్నారని కాంగ్రెసు నాయకులు ఆరోపిస్తున్నారు. నలుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలను, నలుగురుకాంగ్రెసు ఎమ్మెల్యేలను హర్యానాలోని హోటల్లో పెట్టారని మధ్యప్రదేశ్ ఆర్థిక మంత్రి తరుణ్ బానోత్ చెప్పారు. 

బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్పీ) ఎమ్మెల్యేను చార్టర్డ్ ఫ్లయిట్ లో బిజెపి ఢిల్లీ తరలించిందని కాంగ్రెసు సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చెప్పారు. కాంగ్రెసు ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకునేందుకు బిజెపి ప్రయత్నాలు చేస్తోందని ఆయన అన్నారు. 

వారికి బిజెపికి చెందిన రామ్ పాల్ సింగ్, నరోత్తమ్ మిశ్రా, అరవింద్ భదౌరియా, సంజయ్ పాఠక్ డబ్బులు ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. దాడులు చేస్తే వారిని పట్టుకోవచ్చునని ఆయన అన్నారు. 10-11 మంది ఎమ్మెల్యేలను వారు కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని, నలుగురు మాత్రమే ఇప్పుడు వారితో ఉన్నారని, వారు కూడా తిరిగి వస్తారని ఆయన అన్నారు. 

సస్పెన్షన్ కు గురైన బిఎస్పీ ఎమ్మెల్యే రమాబాయ్ ను తమ వెంట తీసుకుని మధ్యప్రదేశ్ మంత్రులు జితూ పట్వారీ, జైవర్ధన్ సింగ్ గురుగ్రామ్ లోని మనేసర్ ఐటిసీ రిసార్ట్ నుంచి బయటకు రావడం కనిపించింది. ఎనిమిది మంది ఎమ్మెల్యేలు వారి బందీలుగా ఉన్నారని, వారికి ఇష్టం లేకపోయినా వారిని బిజెపి నిర్బంధించిందని, వారిలో రమా బాయ్ ఒక్కరని కాంగ్రెసు నేతలు అంటున్నారు. 

తమ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి బిజెపి ప్రయత్నిస్తోందని మధ్యప్రేదశ్ ఉన్నత విద్యాశాఖ మంత్రి జితూ పట్వారీ కూడా అన్నారు. మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ చౌహాన్, మాజీ మంత్రులు నరోత్తమ్ మిశ్రా, భూపేంద్ర సింగ్, రాంపాల్ సింగ్ లతో పాటు సీనియర్ బిజెపి నాయకులు ఎనిమిది ఎమ్మెల్యేలను బలవంతంగా తమ వెంట తీసుకుని వెళ్లారని ఆయన అన్నారు. బిజెపి నేతలు తమను బలవంతంగా నిర్బంధించారని ఎమ్మెల్యేలు చెబుతున్నట్లు ఆయన తెలిపారు.

click me!