
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తనయుడు, రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్ శనివారం సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మం సామాజిక న్యాయం అనే భావనకు విరుద్ధమని, దానిని నిర్మూలించాలని అన్నారు. శనివారం చెన్నైలో జరిగిన ఒక సమావేశంలో పాల్గొన్న ఉదయనిధి స్టాలిన్.. ‘‘కొన్ని విషయాలను వ్యతిరేకించలేము.. వాటిని పూర్దిగా నిర్మూలించాలి. డెంగ్యూ, దోమలు, మలేరియా, కరోనాను మనం ఎదిరించలేము.. వాటిని నిర్మూలించాలి. అదే విధంగా సనాతన ధర్మాన్ని (సనాతన ధర్మాన్ని) నిర్మూలించాలి’’ అని పేర్కొన్నారు.
సనాతన అనే పేరు సంస్కృతం నుండి వచ్చిందని ఉదయనిధి స్టాలిన్ అన్నారు. ఇది సామాజిక న్యాయం, సమానత్వానికి విరుద్ధమని పేర్కొన్నారు. సనాతన ధర్మం సమానత్వానికి, మహిళా సాధికారతకు వ్యతిరేకమని అన్నారు. సనాతనాన్ని వ్యతిరేకించడం కంటే.. దానిని పూర్తిగా నిర్మూలించాలని అన్నారు.
అయితే ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై బీజేపీ తీవంత్రగా స్పందించింది. బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాల్వియా అతని వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘‘80 శాతం జనాభాను మారణహోమానికి పిలుపునిస్తున్నారు’’ అని మండిపడ్డారు. అదే సమయంలో ప్రతిపక్ష ఇండియా కూటమిపై కూడా విమర్శలు గుప్పించారు. ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని మలేరియా, డెంగ్యూతో ముడిపెట్టారని..దానిని నిర్మూలించాల్సిన అవసరం ఉందని అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘క్లుప్తంగా చెప్పాలంటే.. సనాతన ధర్మాన్ని అనుసరించే 80 శాతం భారత జనాభాను నరమేధం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. డీఎంకే ప్రతిపక్ష బ్లాక్‌లో ప్రముఖ సభ్య పార్టీగా ఉంది. కాంగ్రెస్‌కు దీర్ఘకాల మిత్రపక్షం. ముంబైలో జరిగిన మీటింగ్‌లో మీరు అంగీకరించినది ఇదేనా?’’ అని అమిత్ మాల్వియా ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ప్రేమ దుకాణం గురించి మాట్లాడుతున్నారు కానీ.. కాంగ్రెస్ మిత్రపక్షమైన డీఎంకే వారసుడు సనాతన ధర్మాన్ని నిర్మూలించడం గురించి మాట్లాడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ మౌనమే ఈ మారణహోమ పిలుపుకు మద్దతని విమర్శించారు. మరికొందరు బీజేపీ నేతలు సైతం.. ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.
అయితే మాల్వియా వ్యాఖ్యలపై స్పందించి ఉదయనిధి స్టాలిన్.. సనాతన ధర్మాన్ని అనుసరించే వ్యక్తులను ‘‘జాతి నిర్మూలన’’ కోసం తాను ఎప్పుడూ పిలవలేదని అన్నారు. అయితే తన ప్రతి మాటకు కట్టుబడి ఉన్నానని ఉదయనిధి అన్నారు. సనాతన ధర్మం అనేది కులం, మతం పేరుతో ప్రజలను విభజించే సూత్రమని.. సనాతన ధర్మాన్ని పెకిలించడం మానవత్వాన్ని, మానవ సమానత్వాన్ని నిలబెట్టడమేనని అన్నారు. ‘‘నేను మాట్లాడిన ప్రతి మాటకు నేను దృఢంగా నిలబడతాను. సనాతన ధర్మం కారణంగా బాధపడుతున్న అణగారిన, అట్టడుగున ఉన్న వారి తరపున నేను మాట్లాడాను. పేరియార్, అంబేద్కర్ వంటి వారు ఈ అంశంపై లోతైన పరిశోధనలతో పలు రచనలు చేశారు. సమాజంపై సనాతన ధర్మం ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపించిందో చెప్పారు. అవన్నీ అందించడానికి సిద్ధంగా ఉన్నాను’’ అని ఉదయనిధి పేర్కొన్నారు.
‘‘నా ప్రసంగంలోని కీలకమైన అంశాన్ని పునరుద్ఘాటిస్తున్నాను: దోమల ద్వారా కోవిడ్-19, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వ్యాప్తి చెందుతాయో.. అనేక సామాజిక దురాచారాలకు సనాతన ధర్మమే కారణమని నేను నమ్ముతున్నాను. న్యాయస్థానం లేదా ప్రజాకోర్టులో ఏవైనా సవాళ్లను ఎదుర్కొనేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. తప్పుడు వార్తలను వ్యాప్తి చేయడం ఆపండి’’ అని ఉదయనిధి స్టాలిన్ పేర్కొన్నారు.