అయోధ్య దీపోత్సవ వేడుకలను చూసి కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ మైమరచిపోయారు. దీంతో ఇంతఘనంగా దీపోత్సవాన్ని నిర్వహించిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను ఆయన ప్రశంసించారు.
అయోధ్య : కేంద్ర సాంస్కృతిక, పర్యాటక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అయోధ్యలో జరిగిన దీపోత్సవం 2024 వేడుకలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో కలిసి రామకథా పార్క్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన అయోధ్యలో శ్రీరామ మందిర పునర్నిర్మాణం, ఉత్తరప్రదేశ్ అభివృద్ధిలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కృషిని ప్రశంసించారు.
కేంద్ర మంత్రి షెకావత్ మాట్లాడుతూ... ఇక్కడ జరుగుతున్న ఎనిమిదవ దీపోత్సవం చారిత్రాత్మక ఘట్టం అని అన్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలో అయోధ్య నూతన రూపు సంతరించుకుంటోందని అన్నారు. 500 ఏళ్ల క్రితం బాబర్ సేనాపతి మీర్ బాకీ రామమందిరాన్ని ధ్వంసం చేసినప్పటి నుంచి భారతదేశ అదృష్టం క్షీణించిందని అన్నారు.
undefined
భారతదేశ 2000 ఏళ్ల లిఖిత చరిత్ర దాని సంస్కృతి, నాగరికత, ఐశ్వర్యం, జ్ఞాన సంప్రదాయాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిందని షెకావత్ తెలిపారు. కానీ తరువాతి కాలంలో చంగీజ్ ఖాన్ నుండి మొఘలులు, పోర్చుగీసువారు, డచ్, ఫ్రెంచ్, చివరకు బ్రిటిష్ వారి వరకు అనేక దాడుల కారణంగా ఈ సనాతన ధర్మం క్షీణించిందని, భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించారని అన్నారు.
ఈ కష్టాల మధ్య కూడా సనాతన ధర్మం, భారతీయ సంస్కృతిని సాధువులు కాపాడారని ఆయన అన్నారు. ఈ మందిర రక్షణ కోసం ఎందరో ప్రాణాలు అర్పించారని అన్నారు. ఆలయ నిర్మాణానికి కృషిచేసిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహా అందరికీ నమస్కరిస్తున్నానని అన్నారు. 1528లో శ్రీరామ మందిరం కూల్చివేయబడినప్పుడు భారతదేశ అదృష్టం కూడా మసకబారిందని.. కానీ ఇప్పుడు మనం మళ్ళీ ఆ గౌరవం వైపు అడుగులు వేస్తున్నామని అన్నారు.
గత పదేళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశప్రతిష్ట ప్రపంచస్థాయిలో బాగా పెరిగిందని షెకావత్ అన్నారు. భారతీయ జ్ఞాన సంప్రదాయం, ఆయుర్వేదం, విజ్ఞానం, తత్వశాస్త్రం, సనాతన సంప్రదాయాల పునరుద్ధరణ కారణంగా నేడు ప్రపంచం భారతదేశాన్ని కొత్త దృక్పథంతో చూస్తోందని అన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. ఈ దీపోత్సవం భగవాన్ శ్రీరాముడి ఆదర్శాలను సమాజంలో స్థాపించి, భారతదేశాన్ని విశ్వగురువుగా మార్చాలనే మన సంకల్పానికి ప్రతీక అని అన్నారు.
ఈ దీపోత్సవంలో 28 లక్షల దీపాలు వెలిగించడం ఒక నూతన చైతన్యాన్ని జాగృతం చేసిందని, ఇది ఖచ్చితంగా భారతదేశాన్ని కొత్త దిశగా నడిపిస్తుందని కేంద్ర మంత్రి అన్నారు. యోగి ఉత్తరప్రదేశ్ అభివృద్ధిలో కొత్త శిఖరాలను అధిరోహించారని, భారతీయ సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పారని అన్నారు. ఆయన నాయకత్వంలో జరుగుతున్న ఈ దీపోత్సవం భారతదేశానికి ప్రేరణగా నిలుస్తుందని అన్నారు.
చివరగా, ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించినందుకు, ఉత్తరప్రదేశ్ సాంస్కృతిక వారసత్వాన్ని పునరుజ్జీవింపజేసినందుకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను షెకావత్ అభినందించారు. ఈ దీపోత్సవం భారతదేశానికి మాత్రమే కాకుండా, ప్రపంచానికి కూడా ఒక సాంస్కృతిక సందేశం అని, భారతీయ నాగరికత, ఆదర్శాలను ప్రతిబింబిస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్, కేబినెట్ మంత్రులు సూర్య ప్రతాప్ షాహి, స్వతంత్ర దేవ్ సింగ్, జైవీర్ సింగ్, సతీష్ చంద్ర శర్మ, ఎమ్మెల్యే వేద్ ప్రకాష్ గుప్తా, జిల్లా పరిషత్ అధ్యక్షురాలు రోలీ సింగ్, మేయర్ మహంత్ గిరీష్‌పతి త్రిపాఠి, ఎమ్మెల్సీ హరిఓం పాండే సహా పూజ్య సాధువులు, అధికారులు పాల్గొన్నారు.