నా గర్ల్ ఫ్రెండ్ ఐఏఎస్ అధికారి అయింది.. నేను ఐదుసార్లు ఫెయిల్ అయ్యా..: ఢిల్లీలో కోచింగ్ తీసుకుంటున్న అభ్యర్థి

By Mahesh KFirst Published Sep 3, 2022, 2:19 PM IST
Highlights

ఐఐటీ కోచింగ్ కోసం రాజస్తాన్‌లోని కోటా ఎలాగో.. యూపీఎస్సీ శిక్షణ కోసం ఢిల్లీలోని ముఖర్జీ నగర్ అలాంటిదే. ఈ ముఖర్జీ నగర్‌కు బిహార్ నుంచి వెళ్లిన హరేంద్ర పాండే 11 ఏళ్లలో ఐదు సార్లు యూపీఎస్సీ అటెంప్ట్ చేసి విఫలం అయ్యాడు. ఆయన గర్ల్ ఫ్రెండ్ ఇప్పుడు ఐఏఎస్ అధికారి. ఆయన చెప్పిన విషయాలు ఇలా ఉన్నాయి.

న్యూఢిల్లీ: యూపీఎస్సీ పరీక్షలకు కోచింగ్ అనగానే చాలా మందికి గుర్తొచ్చేది ఢిల్లీనే. ఢిల్లీలో ముఖర్జీ నగర్.. యూపీఎస్సీ అభ్యర్థులకు అడ్డా. దేశవ్యాప్తంగా అభ్యర్థులు ఇక్కడకు వచ్చి శిక్షణ పొందుతారు. మరెందరో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులై ఎగిరిపోతుంటారు. ఓ యూట్యూబర్ ఈ యూపీఎస్సీ అడ్డాకు వెళ్లి ఓ అభ్యర్థితో మాట్లాడారు. ఆయన చెప్పిన బాధలు మనసును మెలిపెట్టేలా ఉన్నాయి. 11 ఏళ్లుగా యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యారు. అదే ముఖర్జీ నగర్‌లో ఉన్నారు. మారుమూల గ్రామం నుంచి వచ్చి ఐఏఎస్ కలలతో ఈ అడ్డాకు చేరుకున్నారు. కానీ, అందులో విఫలం అయ్యారు. ఆయన మిత్రులు ప్రతి రాష్ట్రంలో ఐఎస్‌లుగా ఉన్నారు. ఆయన గర్ల్ ఫ్రెండ్ కూడా ఐఏఎస్ అయింది. కానీ, ఆయన మాత్రం అది సాధించకున్నా.. ఒక కొత్త జీవిత దృక్పథాన్ని ఒంటపట్టించుకున్నారు.

బిహార్‌లోని గోపాల్‌గంజ్‌కు చెందిన హరేంద్ర పాండే ఐఏఎస్ కావాలని కలలు కంటూ ఢిల్లీలోని ముఖర్జీ నగర్‌కు వచ్చారు. వారి గ్రామంలో కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చినా చాలా గొప్పగా చూస్తారని ఆయన చెప్పాడు. అలాంటిది తాను ఇంకా పెద్ద లక్ష్యంతో ఇక్కడకు చేరానని వివరంచారు.

ఎందరో మంది మిత్రులు ఇక్కడ తనకు దొరికారని, ముఖర్జీ నగర్ ఒక కొత్త ప్రపంచం అని చెప్పారు. ఎన్నో ఆశలతో ఇక్కడకు వస్తుంటారని, అందులో చాలా తక్కువ మంది మాత్రమే వాటిని సాధించుకుని విజయంతో వెళ్లిపోతుంటారని వివరించారు. తాను తన 11 ఏళ్ల కాలంలో ఐదు సార్లు యూపీఎస్సీ కోసం ప్రయత్నించానని తెలిపారు. అందులో నాలుగు సార్లు మంచి ప్రదర్శన ఇచ్చానని అన్నారు. అయితే, తనకు అదృష్టం కలిసిరాక తన కలలను సాధించుకోలేకపోయానని చెప్పారు.

ఒక రకమైన వ్యాకులతతో ముఖర్జీ నగర్ మూర్ఖుల నగరం అని అన్నారు. ఇక్కడ అభ్యర్థులు కోచింగ్ సెంటర్లతో మూర్ఖులు అవుతారని, కోచింగ్ సెంటర్లు యూపీఎస్సీతో మూర్ఖం అవుతాయని తెలిపారు. ఎవరు ఎలా చెప్పినా.. వింటూ.. నమ్మడం ఇక్కడ అలవాటులోకి వస్తాయని చెప్పారు. ఏ ప్రకటన అయినా మోసం చేయవచ్చని తెలిపారు.

తన ప్రిపరేషన్ కాలంలో ఒక అమ్మాయితో పరిచయం కలిగిందని, ఆమె తన గర్ల్ ఫ్రెండ్ అని అన్నారు. ఇప్పుడు ఆమె ఐఏఎస్ సాధించి బాధ్యతలు తీసుకుందని వివరించారు. ఆమె పేరు ప్రస్తావించడం సరికాదని, ఎందుకంటే.. ఇప్పుడు ఆమె గొప్ప హోదాలో ఉన్నారని చెప్పారు. ఇక్కడ ఉన్నంత కాలం తాము ప్రేమించుకున్నామని, ఆమె ఐఏఎస్ క్రాక్ చేయగానే కొత్త నెంబర్ తీసుకుని మొబైల్ మార్చేసిందని వివరించారు. ఇప్పుడు తనను దూరంగా పెట్టిందని చెప్పారు. అందుకూ తాను బాధపడటం లేదని అన్నారు.

తాను ఆరంభమే తప్పుగా చేశానని, యూపీఎస్సీ పై ఎలాంటి అవగాహన లేకుండా తీసుకున్న నిర్ణయాలే చివరకు తనను ఇలా మిగిల్చాయని చెప్పుకొచ్చారు. ఇంకా కొన్ని తప్పిదాలు జరిగాయని, అందుకే తాను ఐఏఎస్ కొట్టలేదని వివరించారు.

ఆయన ఇంటర్వ్యూ చూసిన నెటిజన్లు హరేంద్ర నిజాయితీపై ప్రశంసలు కురిపించారు. ఐఏఎస్ కోసం ప్రిపేర్ అయ్యేవారికి వాస్తవ ప్రపంచం ఇంకోలా ఉంటుందని మరొకరు రాశారు.

click me!