
శ్రీనగర్: జమ్ము కశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దోడా జిల్లాలో ఓ మినీ బస్సు అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది. చినాబ్ నది తీరాన తలకిందులుగా పడింది. ఈ ప్రమాదంలో 11 మంది దుర్మరణం చెందారు. కనీసం 14 మంది గాయపడ్డట్టు సమాచారం. ఇందులో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. ఘటన జరిగిన వెంటనే స్థానికులు స్పాట్‌కు చేరుకున్నారు. బస్సులో నుంచి ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చే పనిలో నిమగ్నమయ్యారు. ఆర్మీ కూడా సహాయక చర్యలు చేపడుతున్నది. గాయపడినవారిని దోడాలోని హాస్పిటల్‌కు తరలిస్తున్నారు.
తాట్రి నుంచి దోడాకు వెళ్తున్న ఓ మినీ బస్సు ఈ రోజు ఉదయం లోయలో పడింది. సుయి గ్వారీ సమీపంలో చినాబ్ నదీ తీరంలో లోయలోకి బస్సు దూసుకెళ్లింది. లోయ అడుగులో ఆ బస్సు బోల్తా పడి ఉన్నది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేవు.
ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలు స్పందించారు. జమ్ము కశ్మీర్ దోడాలో జరిగిన రోడ్డు ప్రమాదంతో కలత చెందారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. ఈ విషాద సమయంలో బాధాతప్తులైన కుటుంబాలకు సానుభూతి తెలుపుతున్నట్టు పేర్కొన్నారు. గాయపడినవారు వేగంగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్టు వివరించారు. ఈ ప్రమాదంలో మరణించిన వ్యక్తుల కుటుంబాలకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా అందిస్తామని, క్షతగాత్రులకు రూ. 50వేలు అందిస్తామని ప్రకటించారు.
Also Read: భవిష్యత్‌లో పాక్ ఆక్రమిత కశ్మీర్ భారత్‌లో కలుస్తుంది: వైమానిక దళ సీనియర్ అధికారి
మృతుల కుటుంబాలకు తన సానుభూతిని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఈ ఘటన విషాదాన్ని నింపిందని పేర్కొన్నారు. ఈ ప్రమాదం గురించి జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో మాట్లాడినట్టు తెలిపారు. క్షతగాత్రులకు అవసరమైన చికిత్స అందించే ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. వారు వేగంగా కోలుకోవాలని దేవుడిని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు.
దోడాలో చోటుచేసుకున్న ప్రమాద స్థలికి చేరుకున్నామని, సహాయక చర్యలు చేపడుతున్నామని దోడా అదనపు ఎస్పీ వివరించారు. ఘటనా వివరాలు తెలుసుకున్నామని, కావాల్సిన సహకారాలు అందిస్తామని కేంద్రమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.
జమ్ము కశ్మీర్‌లో ఒకవైపు ఎన్‌కౌంటర్లతో సాధారణ పౌరులూ ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవలి కాలంలో ఎన్‌కౌంటర్లు పెరిగాయి. ఈ కాల్పుల్లో మరణాల సంఖ్య కూడా పెరిగింది. కొన్ని ఎన్‌కౌంటర్లు రోజుల తరబడి జరుగుతున్నాయి.
జమ్ము కశ్మీర్‌లో స్థానికేతరులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు కాల్పులు జరుపుతున్న ఘటనలు కలకలం రేపాయి. ఉత్తరప్రదేశ్, బిహార్ సహా పలు రాష్ట్రాల నుంచి జమ్ము కశ్మీర్‌కు ఉపాధి కోసం వెళ్లినవారిపై టెర్రరిస్టులు దాడులు జరిపారు. హతమార్చారు. ఈ కాల్పులు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి.
Also Read: జమ్మూకాశ్మీర్: ఓ పక్క అమిత్ షా పర్యటన.. కాల్పులకు తెగబడ్డ ముష్కరులు, ఓ పౌరుడు మృతి
ఈ ఎన్‌కౌంటర్లు పెరిగిన సందర్భంలోనే కేంద్ర హోం మంత్రి అమిత్ షా జమ్ము కశ్మీర్‌లో మూడురోజుల పాటు పర్యటించారు. ఈ పర్యటనలో జమ్ము కశ్మీర్‌లో నియోజకవర్గ విభజన, ఎన్నికలు, రాష్ట్ర హోదాపై కీలకమైన ప్రకటనలు చేశారు. అలాగే, అక్కడి యువతతో సమావేశమయ్యారు. ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత హోం మంత్రి అమిత్ షా తొలిసారిగా జమ్ము కశ్మీర్‌లో పర్యటించారు.