
మహిళలకు చట్ట సభల్లో రిజర్వేషన్ కల్పించే ‘నారీ శక్తి వందన్ అధినియం’ బిల్లు బుధవారం లోక్ సభలో 454-2 మెజారిటీతో ఆమోదం పొందింది. ఆ బిల్లు ఇప్పుడు రాజ్యసభ ఆమోదం కోసం ఎదురు చూస్తోంది. ఈ బిల్లు చట్టంగా మారితే లోక్ సభ స్థానాలతో పాటు రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు మూడింట ఒక వంతు రిజర్వేషన్లు అమలవుతాయి. అయితే కేంద్ర ప్రభుత్వం జనాభా గణన, డీలిమిటేషన్ ప్రక్రియ నిర్వహించిన తర్వాతే ఈ బిల్లు అమల్లోకి వస్తుందని, దీని వల్ల పార్లమెంటు సభ్యుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని నివేదికలు చెబుతున్నాయి.
కాగా.. మహిళా రిజర్వేషన్ బిల్లును లోక సభలో ప్రవేశపెట్టిన సమయంలో ఎంఐఎం మినహా మిగితా అన్ని ప్రతిపక్ష పార్టీలు మద్దతు ఇచ్చాయి. సభ్యలో ఉన్న 454 మంది పార్లమెంటు సభ్యులు ఓటు వేశారు. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయగా.. ఎంఐఎంకు చెందిన ఇద్దరు సభ్యులు వ్యతిరేకంగా ఓటు వేశారు. ఇందులో ఒకరు హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ కాగా.. మరొకరు అదే ఆయన పార్టీకి చెందిన ఇంతియాజ్ జలీల్.
అయితే ఈ మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించేందుకు కారణాన్ని కూడా ఆ పార్టీ అసదుద్దీన్ ఒవైసీ వార్తా సంస్థ ‘ఏఎన్ఐ’తో వివరించారు. ఈ బిల్లు ఓబీసీ, ముస్లిం మహిళలకు రిజర్వేషన్లు కల్పించదని, అందుకే దానిని వ్యతిరేంచించామని పేర్కొన్నారు. ‘‘ఈ చట్టాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను. ఎక్కువ మంది మహిళలు పార్లమెంటుకు ఎన్నికవుతారని బిల్లు చెబుతోంది. మరి ఈ సభలో ప్రాతినిధ్యం తక్కువగా ఉన్న ఓబీసీ, ముస్లిం మహిళలకు ఎందుకు రిజర్వేషన్లు కల్పించడం లేదు’’ అని ఒవైసీ అన్నారు. ‘‘ముస్లిం మహిళలు జనాభాలో ఏడు శాతం ఉన్నారని మాకు తెలుసు. కానీ ఈ లోక్ సభలో వారి ప్రాతినిధ్యం 0.7% మాత్రమే ఉంది’’ అని తెలిపారు.
‘‘ఈ మోడీ ప్రభుత్వం సవర్ణ మహిళలకు ప్రాతినిధ్యం పెంచాలనుకుంటోంది. ఓబీసీ మహిళలు, ముస్లిం మహిళలకు ప్రాతినిధ్యం ఇవ్వాలని కోరుకోవడం లేదు. ఇప్పటి వరకు లోక్ సభకు 690 మంది మహిళా ఎంపీలు ఎన్నికరు. కానీ వారిలో కేవలం 25 మంది మాత్రమే ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వారు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వలేమని విన్నాను. 1950 రాష్ట్రపతి ఉత్తర్వు ఏమిటి? ఈ రిజర్వేషన్లలో ముస్లిం మహిళలకు కోటాను నిరాకరించడం ద్వారా మీరు వారిని మోసం చేస్తున్నారు’’ అని ఒవైసీ అన్నారు.