
మదర్ థెరీసా (Mother Teresa) స్థాపించిన మిషనరీస్ ఆఫ్ చారిటీకి (Missionaries of Charity) చెందిన బ్యాంకు అకౌంట్లను ఫ్రీజ్ చేయలేదని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. తమ ఖాతాలను స్తంభింపజేయాలని మిషనరీస్ ఆఫ్ ఛారిటీనే స్వయంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అభ్యర్థన పంపినట్లుగా తెలిపింది. దేశంలోని ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ (ఎఫ్‌సీఆర్ఏ) కింద రిజిస్ట్రేషన్ పునరుద్ధరణ కోసం మిషనరీస్ ఆఫ్ ఛారిటీ దరఖాస్తు చేసుకుందని కేంద్ర హోం శాఖ తెలిపింది. అయితే ఈ చట్టం కింద అర్హమైన నిబంధనలను మిషనరీస్ ఆఫ్ చారిటీ సంతృప్తిపరచడం లేదని, అంతేకాకుండా సంస్థపై తమకు రాతపూర్వకంగా కొంత ప్రతికూల సమాచారం అందిందని పేర్కొంది. ఈ క్రమంలోనే నిబంధనలకు అనూలంగా లేకపోవడంతో డిసెంబర్ 25న ఆ దరఖాస్తును తిరస్కరించినట్టుగా వెల్లడించింది. ఆ తర్వాత దరఖాస్తు తిరస్కరణను సమీక్ష కోరుతూ ఆ సంస్థ నుంచి ఎలాంటి అభ్యర్థన రాలేదని పేర్కొంది.
వాస్తవానికి మిషనరీస్ ఆఫ్ ఛారిటీ గడువు ఈ ఏడాది అక్టోబర్ 31తోనే ముగిసినప్పటికీ..పెండింగులో ఉన్న దరఖాస్తులకు సంబంధించి ఇతర సంస్థలతో పాటుగా గడువును డిసెంబర్ 31 వరకూ పొడిగించామని తెలిపింది. మిషనరీస్ ఆఫ్ ఛారిటీకి సంబంధించి ఎలాంటి bank accountsను తాము స్తంభింప చేయలేదని హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే ఏ నిబంధనలు పాటించకపోవడంతో మిషనరీ ఆఫ్ చారిటీ రెన్యూవల్ రిజిస్ట్రేషన్ తిరస్కరణకు గురైందనే విషయాన్ని మాత్రం హోం శాఖ వెల్లడించలేదు.
ఇక, భారత్‌లో మిషనరీస్ ఆఫ్ చారిటీకి చెందిన బ్యాంకు ఖాతాలను కేంద్ర హోం శాఖ స్తంభింపజేసిందని తృణమూల్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించడం తీవ్ర సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఎంఓసీకి భారత్‌లో ఉన్న బ్యాంకు ఖాతాలను క్రిస్మస్ రోజున కేంద్ర హోంశాఖ స్తంభింపజేసిందని తెలిసి షాక్ గురయ్యానని ఆమె అన్నారు. దీంతో 22 వేల మంది రోగులు, ఉద్యోగులకు మందులు, ఆహారం అందకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. చట్టమే ప్రధానమైదని.. కానీ మానవత సాయం విషయంలో రాజీపడకూడదని మమతా బెనర్జీ ట్వీట్ చేశారు.
ఈ క్రమంలోనే స్పందించిన కేంద్ర హోం శాఖ తాము మిషనరీస్ ఆఫ్ చారిటీస్ బ్యాంకు ఖాతాలను స్తంభింప చేయలేదని వెల్లడించింది. ఇదే అంశంపై స్పందించిన మిషనరీష్ ఆఫ్ చారిటీ.. ఎఫ్‌సీఆర్‌ఏ కింద మిషనరీస్ ఆఫ్ చారిటీ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయలేదని తెలిపింది. తమ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయాలని హోంశాఖ ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదని వెల్లడించింది. రిజిస్ట్రేషన్ రెన్యూవల్ దరఖాస్తుకు ఆమోదం లభించలేదని మాత్రమే తమకు తెలిపిందని పేర్కొంది. రిజిస్ట్రేషన్ రెన్యూవల్ అంశం పరిష్కారమయ్యే వరకు.. విదేశీ నిధులు జమయ్యే ఖాతాల్లో లావాదేవీలను నిలిపివేయాలని తమ కేంద్రాలను కోరినట్టుగా తెలిపింది. తమ వైపు నుంచి ఎలాంటి ఉల్లంఘనలు జరగకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా పేర్కొంది.