మెంటల్ స్ట్రెస్, భక్తి గీతాలు, మావో జెడాంగ్.. జయలలిత చివరి రోజులు ఎలా గడిచాయ్?

By Mahesh KFirst Published Oct 20, 2022, 4:33 PM IST
Highlights

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత తన చివరి 75 రోజులు హాస్పిటల్‌లోనే గడిపారు. హాస్పిటల్‌లో చికిత్స పొందుతూనే 2016 డిసెంబర్ 5న మరణించారు. ఆ కాలంలో ఆమె ఎలా కాలం గడిపారనే విషయాలు బయటకు రాలేదు. ఇందుకు సంబంధించి అరుముఘస్వామి కమిషన్ రిపోర్టులో కొన్ని స్టేట్‌మెంట్లు ఉన్నాయి. హాస్పిటల్‌లో చేరడానికి ముందు ఆమె తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నారు. కొంత ఉల్లాసపడటానికి భక్తిగీతాలు విన్నారు. దేవుడి ఫొటోలు బెడ్‌కు దగ్గరగా అంటించుకున్నారు. ఓ వైద్యుడికి మావో జెడాంగ్ పుస్తకం నాయకత్వ లక్షణాలు బోధిస్తుందని జయలలిత చెప్పినట్టు ఆ కమిషన్ రిపోర్టు పేర్కొంది.
 

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం ఆ రాష్ట్ర ప్రజలు సహా ఆమె గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ బాధపడ్డారు. జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూసిన జయలలిత మరణం చుట్టూ ఎన్నో వాదనలు ప్రచారంలోకి వచ్చాయి. 75 రోజుల పాటు హాస్పిటల్‌లో చికిత్స తీసుకున్న ఆమె చివరకు గుండెపోటుతో మరణించారు. హాస్పిటల్‌లో ఆమె ఎలా గడిపారు? ఆమె ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఎలా వ్యవహరించారు? ఇలాంటివన్నీ మిస్టరీనే. ఎందుకంటే వీటి గురించి స్పష్టమైన వివరణలు లేవు. కానీ, ఆమె మరణంపై ముసురుకున్న అనుమానాల నేపథ్యంలో ఏర్పాటు చేసిన జస్టిస్ అరుముఘస్వామి కమిషన్ రిపోర్టులో కొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ రిపోర్టు ఓ డాక్టర్‌తో జయలలిత సంభాషణ, జయలలిత చివరి క్షణాల గురించి శశికళ వర్షన్ ప్రత్యేకంగా ఉన్నాయి. ఇందులో జయలలిత మెంటల్ స్ట్రెస్‌లో ఉండటం, తేలికపడటానికి భక్తి గీతాలు వినడం, ఓ వైద్యుడికి లీడర్షిప్ క్వాలిటీ కోసం మావో జెడాంగ్ పుస్తకం చదవమని సూచించడం వంటి ఆసక్తికర విషయాలు ఉన్నాయి.

జయలలిత అనారోగ్యంతో చెన్నైలోని అపోలో హాస్పిటల్‌లో చేరారు. 75 రోజుల ట్రీట్‌మెంట్ తర్వాత 2016 డిసెంబర్ 5న ఆమె కన్నుమూశారు. ఆమె ట్రీట్‌మెంట్‌లో కొన్ని లోపాలతోపాటు గుండెకు సంబంధించి ఆమెను విదేశాలకు తీసుకెళ్లి చికిత్స చేయాలన్న నిపుణుల సూచనలనూ ఖాతరు చేయకపోవడాన్ని కమిషన్ రిపోర్టు ఎత్తిచూపింది. ఆ రిపోర్టులో ఆసక్తికరమైన కొన్ని విషయాలు చూద్దాం.

2016 ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషిగా తేలడంతో జయలలిత తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారని శశికళ పేర్కొన్నారు. 2016 నుంచే జయలలితకు శరీరంపై బొబ్బలు, సొరియాసిస్ రావడం మొదలైందని వివరించారు. డాక్టర్లు తక్కువ మొత్తంలో స్టెరాయిడ్ డోసులతో ఉపశమనం కల్పించారు. 2016 సెప్టెంబర్ 21న ఆమెకు తీవ్రంగా జ్వరం వచ్చిందని, ఓ అధికారిక కార్యక్రమం నుంచి మధ్యలోనే తిరిగి నివాసానికి వచ్చారని పేర్కొన్నారు. హాస్పిటల్ వెళ్లుమని తాను సూచించినా జయలలిత తిరస్కరించారని తెలిపారు.

Also Read: జయలలిత మృతిపై విచారణ జరపాల్సిందే.. శశికళపై బాంబు పేల్చిన ఆరుముగసామి కమిషన్‌ రిపోర్ట్

భక్తి గీతాలు.. ఆకుపచ్చ మొక్కలు

హాస్పిటల్‌లో ఉన్న కాలంలో జయలలితకు ఒక సహచరిని కొన్ని భక్తిగీతాలతో ఉన్న యూఎస్‌బీ డ్రైవ్ ఇచ్చిందని శశికళ వివరించారు. కొన్ని ఆరోగ్య సమస్యల నుంచి కోలుకుంటూ వాటిని వింటూ ఎంజాయ్ చేసేదని తెలిపారు. జయలలితకు ఇష్టమైన దేవుళ్ల కలర్ ఫొటోలను ఆమె బెడ్‌కు సమీపంగా గది గోడలకు అంటించారని పేర్కొన్నారు.

మావో మరియు నాయకత్వం

జయలలిత తనకు ట్రీట్‌మెంట్ అందిస్తున్న ఓ వైద్యుడికి మావో జెడాంగ్ పుస్తకం చదవాలని సూచించారు. ‘ప్రైవేట్ లైఫ్ ఆఫ్ చైర్మన్ మావో’ అనే పుస్తకాన్ని చదవాలని సూచనలు చేశారు. ఈ పుస్తకం నాయకత్వ లక్షణాలను బోధిస్తుందని వివరించారు. ఈ పుస్తకం మావో జెడాంగ్ జీవితం గురించి ఉంటుంది. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా వ్యవస్థాపకుడైనా మావో జెడాంగ్ జీవితాన్ని విశదీకరించే ఈ పుస్తకాన్ని చైనా నిషేధించింది.

Also Read: తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య మార్పులు.. ఏఐఏడీఎంకే, బీజేపీ మధ్య ముదురుతున్న ముసలం.. శశికళకు బీజేపీ వెల్‌కమ్

జయలలిత చివరి క్షణాలు

‘ఒక డాక్టర్ నన్ను పిలిచి ఆమె చెవి దగ్గర గట్టిగా అక్కా అని పిలువు అని సూచించారు. నేను అలా పిలుస్తూ అరిచాను. ఆమె నన్ను రెండు సార్లు  చూసింది. ఆ తర్వాత అక్కా కళ్లు మూసింది. అక్కకు ట్రీట్‌మెంట్ ఇచ్చిన వైద్యులు ఆమెకు సడన్ హార్ట్ ఎటాక్ వచ్చిందని చెప్పారు. వెంటనే నన్ను అక్కడి నుంచి బయటికి వెళ్లిపోవాలన్నారు. అది వింటూనే నేను గట్టిగా అరిచి కుప్పకూలిపోయా..’ అని జయలలితను అక్కా అని పిలిచే శశికళ వివరించారు. డిసెంబర్ 4వ తేదీన ఆమె ఆరోగ్యం తీవ్రంగా దిగజారిపోయింది.

అదే రోజు శశికళ ఆమె వద్దకు ఫుడ్ ట్రాలీ తీసుకెళ్లినప్పుడు జయలలిత బాడీ కంపించింది.

Also Read: జయలలిత కేసులో కీలక పురోగతి.. ‘హాస్పిటల్ అందించిన చికిత్సలో తప్పిదాలు లేవు’

‘అక్క నాలుక పొడుచుకువచ్చింది. ఆమె పళ్లను అదుముతూ ఏదో రకంగా అరిచింది. ఆమెను చూసి నేనూ అక్కా, అక్కా అంటూ అరిచాను. ఆమె నన్ను చూసి రెండు చేతులూ పైకి లేపి నా వైపు చాచింది. నేను అరుస్తూనే ఒక్క ఉదుటున ఆమెను పట్టుకున్నాను. ఆమె నన్ను చూస్తూ అదే బెడ్‌పై నా మీదకు వాలింది. వైద్యులు, నర్సులు హర్రీగా ట్రీట్‌మెంట్ స్టార్ట్ చేశారు’ అని శశికళ పేర్కొన్నారు.

జయలలితకు హార్ట్ ఎటాక్ వచ్చిందని ఓ వైద్యులు చెప్పగానే శశికళ సొమ్మసిల్లి పడిపోయింది. 2016 డిసెంబర్ 5న రాత్రి 11.30 గంటలకు జయలలిత మరణించారు.

click me!