పురుషవాదం: వివాహబంధానికి నీళ్లొదిలిన మగాళ్లు

By sivanagaprasad KodatiFirst Published Aug 15, 2018, 3:03 PM IST
Highlights

వివాహ బంధం ఎంతో గొప్పదని అందరికి తెలిసిందే. ఈ వివాహ బంధం కొన్ని కుటుంబాల మధ్య ఆత్మీయతను పంచుతుంది. అలాంటి బంధానికి నీళ్లొదిలారు కొంతమంది పురుషులు. 

వారణాసి : వివాహ బంధం ఎంతో గొప్పదని అందరికి తెలిసిందే. ఈ వివాహ బంధం కొన్ని కుటుంబాల మధ్య ఆత్మీయతను పంచుతుంది. అలాంటి బంధానికి నీళ్లొదిలారు కొంతమంది పురుషులు. అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసిన ఈ ఘటన ఎక్కడ జరిగిందా అనుకుంటున్నారా....వారణాసిలోని మణికర్ణికా ఘాట దగ్గర. సమాజం తమపట్ల వివక్ష ప్రదర్శిస్తుందని ఫెమినిజానికి వ్యతిరేకంగా పురుష సమాజం సభ్యులు మణికర్ణికా ఘాట్‌లో వివాహ బంధానికి శాస్త్రోక్తంగా నీళ్లొదిలారు. 

దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి వచ్చిన 150 మంది పురుషులు ఘాట్‌ వద్ద భేటీ అయ్యారు. సమాజంలో పురుషుల వివక్ష జరుగుతుందంటూ చర్చించుకున్నారు. అనంతరం పవిత్ర గంగా నదిలో మునిగి తమ వైవాహిక సంబంధాలకు స్వస్తి చెప్పారు. పురుషులు మహిళలకు సంరక్షకులుగా, వారికి సకల సౌకర్యాలను సమకూర్చే యంత్రాలుగా ఉన్న ప్రస్తుత సంప్రదాయ సమాజంలో తాము ఉండలేమని మళ్లీ అలాంటి సంప్రదాయ సమాజంలోకి వెళ్లలేమని సామాజిక కార్యకర్త అమిత్‌ దేశ్‌పాండే  స్పష్టం చేశారు. తాము సమానత్వాన్ని కోరుతున్నామని... కానీ ప్రస్తుత ఫెమినిజం అందుకు అనుమతించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

పురుషుల పట్ల వివక్షకు తాము నీళ్లొదిలామన్నారు. తాము పురుషుల హక్కుల కోసం పోరాడుతున్నామని, స్త్రీవాద ఉద్యమంతో పలు కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయని సేవ్‌ ఇండియన్‌ ఫ్యామిలీ, దామన్‌ వెల్‌ఫేర్‌ సొసైటీకి చెందిన అనుపమ్‌ దూబే అన్నారు. దేశవ్యాప్తంగా వరకట్న వేధింపులు, లైంగిక వేధింపుల పేరుతో పురుషులపై తప్పుడు కేసులు నమోదవుతున్నాయని, మధ్యప్రదేశ్‌లో ఈ తరహా కేసులు ఎక్కువగా నమోదయ్యాయన్నారు. ఇలాంటి ఘటనలు తమను కలవరపాటుకు గురిచేస్తున్నాయని అందుకే వివాహ బంధానికి వీడ్కోలు పలికామని తెలిపారు. ఇకపై పురుషుల హక్కుల కోసం పోరాడటమే తమ ధ్యేయమని ప్రకటించారు. 

click me!