అద్భుతం : 30యేళ్ల తరువాత నోరు తెరిచిన మహిళ... పుట్టుకతో అతుక్కుపోయిన దవడలు.. !!

By AN TeluguFirst Published Mar 30, 2021, 2:06 PM IST
Highlights

ఢిల్లీలో అసాధారణ అద్భుత సంఘటన జరిగింది. ఢిల్లీ సర్ గంగా రామ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 30 ఏళ్ల మహిళ ఆస్తా మొంగియా తొలిసారిగా నోరు తెరవగలిగింది. ప్రస్తుతం పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో సీనియర్ మేనేజర్‌గా పనిచేస్తున్న ఆస్త పుట్టుకతో సంక్రమించిన ఓ రుగ్మతతో బాధపడుతుంది. గత నెల ఫిబ్రవరిలో ఆసుపత్రిలో చేరింది.

ఢిల్లీలో అసాధారణ అద్భుత సంఘటన జరిగింది. ఢిల్లీ సర్ గంగా రామ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 30 ఏళ్ల మహిళ ఆస్తా మొంగియా తొలిసారిగా నోరు తెరవగలిగింది. ప్రస్తుతం పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో సీనియర్ మేనేజర్‌గా పనిచేస్తున్న ఆస్త పుట్టుకతో సంక్రమించిన ఓ రుగ్మతతో బాధపడుతుంది. గత నెల ఫిబ్రవరిలో ఆసుపత్రిలో చేరింది.

ఆస్త గత ముప్పై యేళ్లుగా ఈ వ్యాధితో బాధపడుతోంది.  ఆస్తా దవడ ఎముక ఆమె నోటి రెండు వైపుల నుండి ఆమె పుర్రె ఎముకతో కలిపి ఉంది. ఇలా చాలా అరుదుగా జరుగుుతంది. ఈ కారణంగా, ఆమె ఇప్పటివరకు ఎప్పుడూ నోరు తెరవలేదు. అంతేకాదు ఘనపదార్థాలు తీసుకోలేదు. గత ముప్పై ఏళ్లుగా ద్రవాహారం మాత్రమే తీసుకుంటోంది. 

నోరు తెరవకపోవడంతో ఆస్తా నోట్లోని దంతాలు క్రమంగా క్షీణించి ఊడిపోయాయని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఆస్తా పరిస్థితి క్యూషియల్ గా మారడంతో ఏ ఆస్పత్రీ ఆమెకు ఆపరేషన్ చేయడానికి ముందుకు రాలేదు. ఆస్తా ఈ పరిస్థితి మీద ఆమె, ఆమె కుటుంబసభ్యులు దేశంలోని ఎంతోమంది ప్రముఖ వైద్యులను, ఆస్పత్రులను సంప్రదించారు. దుబాయ్, యునైటెడ్ కింగ్ డమ్ లలో కూడా ప్రయత్నించారు. 

చివరికి సర్ గంగా రామ్ ఆసుపత్రిలో  ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జరీ విభాగంలో  సీనియర్ ప్లాస్టిక్ సర్జన్ గా పనిచేస్తున్న డాక్టర్ రాజీవ్ అహుజా ఈ కేసును తీసుకోవడానికి అంగీకరించారు.

‘రోగిని చూసినప్పుడు సమస్య ఎంత తీవ్రమైందో అర్థమయింది. ఆపరేషన్ చాలా క్లిష్టంగా ఉండబోతోందని తెలిసింది. అంతేకాదు ఆపరేషన్ సమయంలో విపరీతమైన రక్తస్రావం వల్ల ఆపరేషన్ టేబుల్‌పైనే రోగి మరణించే అవకాశాలు కూడా ఉన్నాయని కుటుంబానికి చెప్పాం. వారు అంగీకరించిన తరువాత ప్లాస్టిక్ సర్జరీ, వాస్కులర్ సర్జరీ, రేడియాలజీ విభాగాలతో కూడిన టీంను ఏర్పాటు చేసి ఈ ఆపరేషన్ ను నిర్వహించాలని నిర్ణయించుకున్నాం. దీనిమీద అనేక చర్చలు జరిగాయి..’ అనిడాక్టర్ రాజీవ్ అహుజా అన్నారు.

ఆస్తాకు చికిత్స చేసిన బృందంలో డాక్టర్ రామన్ శర్మ, డాక్టర్ ఇతిశ్రీ గుప్తా (ప్లాస్టిక్ సర్జరీ), డాక్టర్ అంబరేష్ సాత్విక్ (వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జరీ), డాక్టర్ జయశ్రీ సూద్, డాక్టర్ అమితాబ్ (అనస్థీషియా టీం)లు ఉన్నారు. ఈ బృందానికి డాక్టర్ రాజీవ్ అహుజా స్వయంగా నాయకత్వం వహించారు. 

ఈ ఆపరేషన్ కు మూడు వారాల ముందు నుంచి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. రక్తనాళాలను కొద్దిగా కుంచించేలా చేయడానికి ఓ ప్రత్యేక ఇంజెక్షన్ రోగి మొహానికి ఇచ్చారు. 2021 మార్చి 20 న ఆపరేషన్ జరిగింది.

పుర్రెలోని ట్యూమర్ కు అనుసంధానించబడి ఉన్న సిరలను నోటి కుడి భాగానికి చేరేలా చేసి.. అక్కడి దవడ పుర్రెను కత్తిరించారు. అలాగే ఎడమవైపు కూడా చేశారు. ఈ క్రమంలో ఏ కాస్త అప్రమత్తంగా ఉన్నా.. ఒక్క సిర తెగినా రోగి ఆపరేషన్ థియేటర్లోనే మరణించి ఉండేది" అని వైద్యులు వెల్లడించారు.

3.5 గంటలు జరిగిన ఈ ఆపరేషన్ విజయవంతమయ్యింది. ఆస్తా నోరు 2.5 సెంటీమీటర్ల వరకు తెరుచుకుంది. ఆపరేషన్ అయిన ఐదు రోజుల తరువాత రోగి ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఆ సమయంలో ఆస్త 3 సెంటీమీటర్ల వరకు నోరు తెరవగలిగింది. 

డాక్టర్ రాజీవ్ అహుజా మాట్లాడుతూ, "నోటి ఫిజియోథెరపీ, వ్యాయామం రెగ్యులర్ గా చేస్తే నోరు మరింత తెరవగలుగుతుంది" అని అన్నారు. ఆస్తా తండ్రి హేమంత్ పుష్కర్ మొంగియా మాట్లాడుతూ "నా కూతురు గత 30 ఏళ్లుగా చాలా బాధపడింది, ఆమె నోరు కూడా తెరవలేదు, ఆమె తన నాలుకను చేతితో కూడా తాకలేదు. ఈ రోజు, ఈ ఆపరేషన్ అయిన తరువాత ఆమె నోరు తెరవడమే కాదు, నాలుకను కూడా తాకగలుగుతుంది. ఆమె ఇప్పుడు మామూలుగా పనులు చేసుకోవచ్చు’’ అన్నారు.

నాకు ఇది రెండో జన్మ. దీనికి దేవునికి, వైద్యులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను" అని ఆపరేషన్ తరువాత ఆస్తా మొంగియా ఆనందం వ్యక్తం చేశారు. 

click me!