
Happy Diwali: దేశవ్యాప్తంగా దీపావళిని ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈ దీపావళి అందిరి జీవితంలో వెలుగులు నింపాలంటూ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ సహా ఇతర రాజకీయ నేతలు తమ శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్విట్టర్‌లో ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ దీపాల పండుగ వారికి ఆనందం, శ్రేయస్సును అందించాలని ఆకాంక్షించారు. 'ప్రతి ఒక్కరికీ దీపావళి శుభాకాంక్షలు. దీపావళి ప్రకాశం.. తేజస్సుతో ముడిపడి ఉంది. ఈ పవిత్రమైన పండుగ మన జీవితాల్లో ఆనందం, శ్రేయస్సు స్ఫూర్తిని మరింత పెంచాలి. మీరు కుటుంబం-స్నేహితులతో అద్భుతమైన దీపావళిని కలిగి జరుపుకోవాలని నేను ఆశిస్తున్నాను" అని ఆయన ట్వీట్ చేశారు.
దేశ అధ్యక్షులు ద్రౌపది ముర్ము సైతం పౌరులకు తన దీపావళి శుభాకాంక్షలను తెలియజేశారు. "దేశ ప్రజలందరి జీవితాల్లో ఆనందం.. శ్రేయస్సు" కోసం తాను ప్రార్థిస్తున్నానని తెలిపారు. “దేశ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు! ఈ పవిత్రమైన కాంతి.. ఆనందాల పండుగ రోజున, జ్ఞానం-శక్తి దీపాన్ని వెలిగించడం ద్వారా అవసరమైన వారి జీవితాల్లో ఆనందాన్ని తీసుకురావడానికి ప్రయత్నిద్దాం. ఈ గొప్ప పండుగ సందర్భంగా దేశప్రజలందరి జీవితాల్లో సంతోషం, శ్రేయస్సు ఉండాలని ప్రార్థిస్తున్నాను' అని రాష్ట్రపతి ట్వీట్ చేశారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా దేశ పౌరులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. “దేశ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపాల పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషాన్ని, ఆరోగ్యాన్ని, శ్రేయస్సును తీసుకురావాలని కోరుకుంటున్నాను” అని ఆయన పేర్కొన్నారు. అలాగే, “అందరికీ వెచ్చని దీపావళి శుభాకాంక్షలు. ఈ పండుగ మీ జీవితంలో ఆనందం, ఆరోగ్యం, సంపదను తీసుకురావాలని కోరుకుంటున్నాను' అని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ట్వీట్ చేశారు.
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ పార్లమెంట్ సభ్యులు రాహుల్ గాంధీ దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షులు తెలిపారు. "పవిత్ర దీపావళి పండుగ చీకటిపై వెలుగు, అధర్మంపై సాధించిన విజయానికి ప్రతీకగా నిలుస్తుంది. ప్రతిచోట సంతోషకరమైన భారతదేశం కోసం దీపాలను వెలిగించండి, ఆనందాన్ని పంచండి.. చిరునవ్వులను వ్యాప్తి చేయండి.. అందరికీ దీపావళి శుభాకాంక్షలు! " రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.
దీపావళి సందర్భంగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ అందరికీ సానుకూల శక్తిని పంచాలని ఆకాంక్షించారు. "దీపావళి ప్రకాశవంతమైన కాంతి ప్రతికూలత చీకటిని పారద్రోలి.. సానుకూల శక్తి కాంతిని ప్రతిచోటా వ్యాపింపజేయాలి. మీ జీవితంలో విజయం, కీర్తి, ఆనందం, శ్రేయస్సు వర్ధిల్లాలి. అందరికీ దీపావళి..లక్ష్మీ పూజ శుభాకాంక్షలు! " అని పవార్ ట్వీట్ చేశారు. జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ వైస్ ప్రెసిడెంట్ ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేస్తూ, “దీపావళి శుభాకాంక్షలు. అన్ని దీపాల నుండి వచ్చే కాంతి మీ జీవితాలను ఆనందం, మంచి ఆరోగ్యం, శాంతి శ్రేయస్సుతో నింపాలి" అంటూ ట్వీట్ చేశారు.