భూకంప తీవ్రతతో నేపాల్ లోని రుకమ్ జిల్లాలో ఇల్లు కూలిపోయాయి. 35 మంది మృత్యువాత పడ్డారు. జజర్ కోట్ లో 34 మంది మరణించారు. ఇంకా సహాయకచర్యలు కొనసాగుతున్నాయి.
నేపాల్ : ప్రకృతి పగ పట్టింది. మానవ తప్పిదాలకు ప్రకృతి వైపరీత్యాల రూపంలో శిక్షిస్తోంది. అలాంటి విషాద ఘటన నేపాల్ లో శుక్రవారం రాత్రి సంభవించింది. 6.4 తీవ్రతతో ఏర్పడిన భూకంపం 128 మంది ప్రాణాలను బలి తీసుకుంది. వందలాది మందిని క్షతగాత్రులుగా మిగిల్చింది. మరింత మంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. నేపాల్ లోని వాయువ్య జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించినట్లుగా స్థానిక అధికారులు వివరాలు చెబుతున్నారు.
శుక్రవారం రాత్రి 11:00 దాటిన తర్వాత ఈ భూకంపం సంభవించడంతో అనేక ప్రాంతాలకు కమ్యూనికేషన్ తెగిపోయింది. ఈ కారణం వల్లనే మొదట యుఎస్ జియోలాజికల్ సర్వే భూకంప తీవ్రతను 5.6 గా తెలిపింది. అర్ధరాత్రి కావడంతో మొదట ప్రమాద తీవ్రత అంతగా తెలియరాలేదు. భూకంప కేంద్రం 11 మైళ్ల లోతులో ఉన్నట్లుగా గుర్తించింది.
నేపాల్ లో సంభవించిన ఈ భూకంపా తీవ్రతకు భారత్లోని అనేక ప్రాంతాలు కంపించాయి. నేపాలకు 800 కిలోమీటర్ల దూరంలో ఉన్న భారత రాజధాని ఢిల్లీతో పాటు యూపీ, బీహార్ లోని అనేక ప్రాంతాల్లో భూ ప్రకంపనలు వచ్చాయి. ఇప్పటికే వాయు కాలుష్యంతో సతమతమవుతున్న ఢిల్లీ వాసులు.. ఒక్కసారిగా భూమి కదులుతుండడంతో భయభ్రాంతులకు గురై ఇళ్లలో నుంచి బయటికి పరుగులు తీశారు. చాలాసేపటి వరకు రోడ్ల మీదే ఉండిపోయారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
నేపాల్ దేశ రాజధాని కాట్మండుకు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న జాజర్ కోట్ లో భూకంప కేంద్రం ఉన్నట్లుగా గుర్తించారు. ఈ మేరకు నేపాల్ జాతీయ భూకంప పర్యవేక్షణ పరిశోధన కేంద్రం తెలిపింది. ఈ భూకంప తీవ్రతతో నేపాల్ లో భారీ స్థాయిలో నష్టం జరిగింది. రుకమ్ జిల్లాలో ఇల్లు కూలిపోయాయి. ఈ ఒక్క జిల్లాలోని 35 మంది మృత్యువాత పడ్డారు. జజర్ కోట్ లో 34 మంది మరణించినట్లుగా సమాచారం. అర్ధరాత్రి కావడం, కమ్యూనికేషన్ కట్ అవ్వడం, కొండ చర్యలు విరిగిపడడం.. లాంటి కారణాలతో సహాయక చర్యలు కష్టంగా మారాయి.
నేపాల్ ప్రధాని పుష్పకమల్ మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. అయితే, భూకంపం సంభవించే సమయానికి ఇంకా ప్రజలందరూ నిద్రకు ఉపక్రమించకపోవడంతో భారీ ప్రాణ నష్టం తగ్గిందని తెలుస్తోంది. నేపాల్ లో 2017 లో వచ్చిన భూకంపం 9,000 మందిని బలి తీసుకుంది. ఆ సమయంలో 7.8 తీవ్రతతో భూకంపం సంభవించింది.