యెస్‌ బ్యాంక్‌లో భారీగా లేఆఫ్‌లు: 500 మంది ఉద్యోగులకు ఉద్వాసన

By Galam Venkata Rao  |  First Published Jun 26, 2024, 11:17 AM IST

యెస్‌ బ్యాంక్‌లో పెద్ద సంఖ్యలో ఉద్యోగాల కోత (లేఆఫ్‌) విధించినట్లు తెలుస్తోంది. హోల్‌సేల్‌, రిటైల్‌, బ్రాంచ్‌ బ్యాంకింగ్‌ సెగ్మెంట్‌.. ఇలా పలు విభాగాల్లో ఉద్యోగులను లేఆఫ్‌ కింద తొలగించారు.


భారతీయ ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ సంస్థ యెస్ బ్యాంక్ తమ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. యెస్ బ్యాంక్ పునర్నిర్మాణ ప్రక్రియలో వందలాది మంది ఉద్యోగులకు లేఆఫ్ విధిస్తోంది. తాజాగా 500 మంది ఉద్యోగులను లేఆఫ్ ద్వారా తొలగించినట్లు తెలుస్తోంది. కాగా, తొలగించిన ఉద్యోగులకు మూడు నెలల వేతనం చెల్లించారు. యెస్ బ్యాంక్‌లో భవిష్యత్తు మరిన్ని ఉద్యోగాల కోత విధించే అవకాశం ఉన్నట్లు సమాచారం. 

ఎకనమిక్ టైమ్స్‌ నివేదిక ప్రకారం, యెస్‌ బ్యాంక్‌లో పెద్ద సంఖ్యలో ఉద్యోగాల కోత (లేఆఫ్‌) విధించినట్లు తెలుస్తోంది. హోల్‌సేల్‌, రిటైల్‌, బ్రాంచ్‌ బ్యాంకింగ్‌ సెగ్మెంట్‌.. ఇలా పలు విభాగాల్లో ఉద్యోగులను లేఆఫ్‌ కింద తొలగించారు. బ్యాంక్ పునర్నిర్మాణ ప్రక్రియలో భాగంగా ఇలా వందలాది మంది ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం. అలాగే మరిన్ని ఉద్యోగాల కోత ఉంటుందని ఎకనమిక్‌ టైమ్స్‌ నివేదిక వెల్లడించింది. వర్క్‌ఫోర్స్‌ను ఆప్టిమైజ్ చేయడం ద్వారా కార్యాచరణను సమర్థంగా మార్చాలని చూస్తున్నట్లు యెస్‌ బ్యాంక్‌కు చెందిన ఓ ప్రతినిధి తెలిపారు. బహుళజాతి కన్సల్టెంట్ సలహా మేరకు ఈ లేఆఫ్‌లు జరిగాయని చెప్పారు. 

Latest Videos

ఇదిలా ఉండగా... యెస్ బ్యాంక్ స్టాక్స్‌ బీఎస్‌ఈలో క్రితం ముగింపు రూ.23.95తో పోలిస్తే మంగళవారం రూ.24.02 వద్ద ఫ్లాట్‌గా ముగిసింది. బ్యాంక్ మార్కెట్ క్యాప్ రూ.75,268 కోట్లుగా ఉంది.

కాగా, యెస్ బ్యాంక్ డిజిటల్ బ్యాంకింగ్ వైపు మొగ్గు చూపడంతో పాటు మాన్యువల్ జోక్యాన్ని తగ్గించడం ద్వారా ఖర్చులను తగ్గించుకోవాలని చూస్తోంది. 2023, 2024 ఆర్థిక సంవత్సరం మధ్య సిబ్బంది ఖర్చులు 12 శాతానికి పైగా పెరిగాయి. 2023 ఆర్థిక సంవత్సరం చివరినాటికి ఖర్చులు రూ.3,363 కోట్లు ఉండగా... అది 2024 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రూ.3,774 కోట్లకు పెరిగాయి. 

ప్రస్తుతం యెస్‌ బ్యాంక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ప్రశాంత్ కుమార్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత 2020లో కూడా ఇలాగే లేఆఫ్‌లు చేపట్టారు. 
 

click me!