ఏపీలోని ప్రకాశం జిల్లాలో అతి పురాతనమైన ఆస్ట్రిచ్ గూడును ఆర్కియాలజిస్టులు కనుగొన్నారు. ఇది 41వేల సంవత్సరాల నాటిది చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో అరుదైన శిలాజాలు వెలుగుచూశాయి. 41వేల ఏళ్ల నాటి ఆస్ట్రిచ్ (నిప్పుకోడి) గూడును పురావస్తు శాస్త్రవేత్తల బృందం కనిపెట్టింది. ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతనమైందిగా ఆర్కియాలజిస్టులు గుర్తించారు. వడోదరకు చెందిన ఎంఎస్ యూనివర్సిటీతో పాటు జర్మనీ, ఆస్ట్రేలియా, యూఎస్‌కు చెందిన ఆర్కియాలజిస్టులు శిలాజ సమృద్ధిగా ఉన్న స్థలాన్ని పరిశోధిస్తున్న సమయంలో ఇది బయటపడింది. 9 నుంచి 11 గుడ్లను భద్రపరిచేందుకు ఆస్ట్రిచ్ గూడు పెట్టినట్లు పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
భారతదేశంలో మెగాఫౌనా (40 కిలోల కంటే ఎక్కువ బరువున్న జంతువులు) ఎందుకు అంతరించిపోయాయో తెలుసుకునేందుకు ఈ అన్వేషణ చాలా కీలకమని పరిశోధకులు అంటున్నారు.
సాధారణంగా, ఒక ఆస్ట్రిచ్ గూడు 9-10 అడుగుల వెడల్పు ఉంటుంది. ఒకేసారి 30 నుంచి 40 గుడ్లను అందులో ఉంచగలదు. అయితే, ప్రకాశం జిల్లాలో కనుగొన్న శిలాజాలు భిన్నంగా ఉన్నాయి. 1x1.5 మీటర్ల మేర కనుగొన్న అవశేషాల్లో దాదాపు 3వేల500 ఆస్ట్రిచ్ గుడ్డు పెంకులు ఉన్నాయి. ఇది దక్షిణ భారతదేశంలో ఆస్ట్రిచ్ ఉనికికి మొదటి సాక్ష్యం. అలాగే, 41వేల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో ఆస్ట్రిచ్‌లు ఉన్నాయనడానికి మొదటి సాక్ష్యం కూడా.
గుర్రాలు, ఏనుగులు, పశువులు, హిప్పోపొటామస్ లాంటి భారీ జంతువులను మెగాఫౌనా అని పిలుస్తారు. భారీ ఆకృతిగల ఈ మెగాఫౌనా జంతువులు కొన్ని 40వేల సంవత్సరాల క్రితం ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి అంతరించిపోయాయి.
‘‘అతి పురాతనమైన ఆస్ట్రిచ్ గుడ్డు షెల్‌ను గతంలో భారతదేశం వైపున ఉన్న సివాలిక్ కొండల్లో కొనుగొన్నారు. అవి 20 లక్షల సంవత్సరాల కంటే ఎక్కువ కాలం నాటివని ఆర్కియాలజిస్టులు నిర్ధారించారు. ద్వీపకల్ప భారతదేశంలో కూడా, ఆస్ట్రిచ్ గుడ్డు పెంకుల శిలాజాలను రాజస్థాన్‌లోని కటోటి ప్రాంతంలో గుర్తించారు. అవి 60వేల సంవత్సరాల నాటివని తెలిసింది’’ అని MS యూనివర్సిటీలోని ఆర్కియాలజీ విభాగానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ దేవర అనిల్‌కుమార్ వివరించారు. ఈయన ఏప్రిల్ 2023 నుంచి ఈ ప్రాజెక్ట్‌పై పని చేస్తున్నారు.
ఆస్ట్రిచ్‌లు ఇప్పటికంటే భారీ సైజులో ఉండేవి. దాదాపు ఏనుగు అంత సైజులో ఉండేవి. కాల క్రమేణా వీటి శరీర నిర్మాణంలో మార్పులు జరిగాయి. గతంలో ఆస్ట్రిచ్‌లు ఎగరగలిగేవట. ప్రస్తుతం అంతరించిపోయే దశలోనే ఉన్నాయి. దీంతో వాటి సంఖ్యను పెంచేందుకు అనేక పరిశోధనలు, ప్రయత్నాలు జరుగుతున్నాయి.