రాజధానిలో పెరుగుతున్న కరోనా కేసులు.. మళ్లీ మాస్క్ తప్పనిసరి నిబంధన.. ఉల్లంఘిస్తే రూ. 500 జరిమానా

By Mahesh KFirst Published Aug 11, 2022, 12:45 PM IST
Highlights

దేశ రాజధాని ఢిల్లీలో మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మాస్క్ తప్పనిసరి నిబంధనను అరవింద్ కేజ్రీవాల్ మళ్లీ అమల్లోకి తెచ్చాడు. ఈ నిబంధన ఉల్లంఘిస్తూ రూ. 500 ఫైన్ వేస్తున్నారు.
 

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గత వారం నుంచి ఈ కేసుల్లో పెరుగుదల కనిపిస్తున్నది. మరణాలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. అదీగాక, ఒమిక్రాన్‌కు ఉప వేరియంట్‌ను ఢిల్లీలోని ఓ హాస్పిటల్ గుర్తించింది. ఈ వేరియంట్ చాలా వేగంగా వ్యాపించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నది. ఇలాంటి పలు కీలక అంశాల నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం మళ్లీ మాస్క్ ధరించడాన్ని తప్పనిసరి చేసింది. లేదంటే.. రూ. 500 జరిమానా విధించాలని ఆదేశించింది.

ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం మాస్క్‌ను మళ్లీ తప్పనిసరి చేసింది. ఈ నిబంధన ఉల్లంఘించిన వారికి రూ. 500 జరిమానా విధించడానికి నిర్ణయం తీసుకుంది. అయితే, ప్రైవేటు కారులో కలిసి ప్రయాణిస్తున్నవారికి ఈ జరిమానా నుంచి మినహాయింపు ఉంటుందని తెలిపింది.జిల్లా యంత్రాంగాలకు ఇప్పటికే ఈ నిబంధనలు అమలు చేయాలని ఆదేశాలు వెళ్లాయి. ఈ నిబంధనలు సక్రమంగా అమలు చేయడానికి లేదా ఉల్లంఘనలు పర్యవేక్షించడానికి దక్షిణ జిల్లాలో ఎన్‌ఫోర్స్‌మెంట్ టీమ్‌ను ఏర్పాటు చేశారు.

బుధవారం ఢిల్లీలో కొత్తగా 2,146 కేసులు నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 17.83 శాతానికి పెరిగింది. ఎనిమిది మంది పేషెంట్లు మరణించారు. అయితే, ఈ మరణాల్లో ఎక్కువగా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులే ఎక్కువ ఉన్నారని చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. పెరుగుతున్న కరోనా ఇన్ఫెక్షన్ల నేపథ్యంలో 7 రాష్ట్రాలకు కేంద్రం లేఖ రాసింది. పండుగల సీజన్‌లో అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. వృద్దులు, పిల్ల‌ల్లో ఈ వేరియంట్ ఎక్కువ‌గా వ్యాప్తి చెందే అవ‌కాశాలున్నాయ‌ని హెచ్చ‌రించింది. 

click me!