‘‘గత జన్మలో నువ్వే నా భర్త..రా... కలిసి బతుకుదాం’’.. యువతిపై ఆశపడిన వివాహిత

First Published 10, Sep 2018, 12:55 PM IST
Highlights

గత జన్మలో నువ్వే నా భర్తవి.. ఈ జన్మలో నా కోసం మళ్లీ పుట్టావు ఈ డైలాగు ఏ సినిమాలోనిదో కాదు.. నిజంగా జరిగిన సంఘటన. ముంబైకి చెందిన వెరోనికా బరోడే అనే  వివాహిత ఓ ఇనిస్టిట్యూట్‌లో ట్యూటర్‌గా పనిచేస్తోంది. 

గత జన్మలో నువ్వే నా భర్తవి.. ఈ జన్మలో నా కోసం మళ్లీ పుట్టావు ఈ డైలాగు ఏ సినిమాలోనిదో కాదు.. నిజంగా జరిగిన సంఘటన. ముంబైకి చెందిన వెరోనికా బరోడే అనే  వివాహిత ఓ ఇనిస్టిట్యూట్‌లో ట్యూటర్‌గా పనిచేస్తోంది. ముంబైలోని టాటా మెమోరియల్ ఆస్పత్రికి వెళ్లిన సమయంలో ఆమెకు ఇండోర్‌కు చెందిన ఓ బీటెక్ విద్యార్థినిని ఎక్కడో చూసినట్లుగా అనిపించి ఆ అమ్మాయితో మాట కలిపింది.

అలా పరిచయం చేసుకుని ఇద్దరూ ఒకరి ఫోన్  నెంబర్లు మరొకరికి ఇచ్చుకున్నారు. తన తల్లి క్యాన్సర్ రోగి కావడంతో సదరు యువతి ముంబైలోనే కొద్దిరోజులు ఉంది. దీంతో వెరోనికా ఆమెకు ప్రతిరోజూ ఫోన్ చేయడం మొదలు పెట్టింది. యువతి తల్లి గురించి ఆరా తీస్తూ.. ఆమెతో స్నేహం పెంచుకుంది.

అయితే కొద్దిరోజుల నుంచి ‘‘ గత జన్మలో నువ్వే నా భర్తవి.. కాబట్టి ఈ జన్మలో కూడా నా భర్తగా ఉండే హక్కు నీకు మాత్రమే ఉంది..  మనం పెళ్లి చేసుకుని బంధాన్ని కొనసాగిద్దాం’’ అంటూ వేధించసాగింది. వెరోనికా వేధింపులకు విసిగిపోయిన విద్యార్థిని ఆమె ఫోన్ ఎత్తడం మానేసింది.. దీంతో ఉన్మాదిగా మారిపోయిన వెరోనికా.. ఇండోర్ వెళ్లి యువతి చదువుకునే కళాశాలకు వెళ్లి ఆరా తీసింది.

అయితే విద్యార్థిని ముంబైలోనే ఉందని తెలుసుకుని తనను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని భావించి ఆమెను కిడ్నాప్ చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ఓ పోలీస్ కానిస్టేబుల్ సాయం తీసుకుంది. ఈ నేపథ్యంలో యువతి ఫ్లాట్‌కు వెళ్లిన వెరోనికా ఆమెను అపహరించేందుకు ప్రయత్నించింది.

ఈ పరిణామానికి నివ్వెరపోయిన విద్యార్థిని వెంటే సేఫ్టీ అలారమ్ మోగించడంతో అపార్ట్‌మెంట్లో ఉంటున్న స్థానికులు అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. వెరోనికాను, ఆమెకు సాయం చేసేందుకు వచ్చిన కానిస్టేబుల్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వెరోనికా చెప్పిన కారణం విని పోలీసుల కళ్లు బైర్లు కమ్మాయి.
 

Last Updated 19, Sep 2018, 9:18 AM IST