
9.5 కోట్ల విలువైన మణపురం బంగారం దోపిడీ కేసులో ప్రధాన నిందితుడిని ఆగ్రా పోలీసులు (Agra police) శుక్రవారం అరెస్టు చేశారు. గతేడాది జులైలో కంపెనీ సిబ్బందిని బందీలుగా ఉంచుకుని కమ్లానగర్ (Kamlanagar) ప్రాంతంలో దోపిడీ జరిగింది. దోపిడి జరిగిన దాదాపు ఏడు నెలల తరువాత నిందితుడుని అరెస్టు చేశారు.
ఈ బంగారం దోపిడికి పాల్పడిన నిందితుడిని నరేంద్ర (Narendra) అలియాస్ లాలా (Lala)గా పోలీసులు గుర్తించారు. అతడిపై పోలీసులు లక్ష రూపాయల రివార్డును గతంలోనే ప్రకటించారు. అయితే ప్రస్తుతం అతడిని పశ్చిమ బెంగాల్ (West Bengal) లోని దక్షిణ 24 పరగణాస్ జిల్లా (South 24 Parganas district) నుంచి అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో సహ నిందితులుగా ఉన్న లాలా సోదరుడు, తల్లిని కూడా అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ట్రాన్సిట్ రిమాండ్ (transit remand) కోసం స్థానిక కోర్టు ముందు శనివారం హాజరుపరిచారు. నిందితులను పశ్చిమ బెంగాల్ నుంచి ఆగ్రా (Agra)కు తీసుకువస్తున్నట్లు పోలీసు అధికారులు మీడియాతో తెలిపారు.
ఈ దోపిడి జూలై 17వ తేదీన జరిగింది. అయితే ఇందులో ప్రమేయం ఉన్న మరో ఇద్దరు నిందితులైన మనీష్ పాండే (Manish Pandey), నిర్దోష్ కుమార్ (Nirdosh Kumar) లు ఈ దోపిడిని జరిగిన కొన్ని గంటల తర్వాత పోలీసుల ఎన్‌కౌంటర్ (encounter) లో చనిపోయారు. ఈ కేసులో మరో నిందితుడు ప్రభాత్ శర్మ (Prabhat Sharma) పోలీసుల ఎదుట లొంగిపోయాడు.
మొత్తంగా బంగారం దోపిడీ కేసులో ఇప్పటి వరకు 14 మందిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 11.5 కేజీల బంగారం, రూ.6 లక్షల నగదును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫిరోజాబాద్ (Firozabad) కు చెందిన లాలా నుంచి 2.5 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. లాలా ఫిరోజాబాద్ (Firozabad)ని వివిధ పోలీస్ స్టేషన్లలో దాదాపు 17 క్రిమినల్ కేసుల (criminal cases)ను ఎదుర్కొంటున్నాడు.