
మణిపూర్ (manipur) అసెంబ్లీ (assembly) ఎన్నికల మొదటి దశ పోలింగ్ కు కొన్ని గంటలకు ముందు శనివారం రాష్ట్రంలోని చురచంద్‌పూర్ జిల్లాలో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.
స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చురచంద్ పూర్ (Churachandpur) జిల్లాలోని గ్యాంగ్పిమువల్ (Gangpimual) గ్రామంలో ఓ ఇంట్లో బాంబు ఉంచారు. అయితే అదేంటో తెలియక ఆ ఇంట్లోని పిల్లలు బాంబుతో ఆడుకోవడం ప్రారంభించారు, ఈ క్రమంలో అది పేలింది. దీంతో ఆ ప్రాంతంలో ఉన్న ఏడుగురికి గాయాలు అయ్యాయి. దీంతో స్థానికులు వారందరినీ చురచంద్‌పూర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ఘటనలో చిన్నారితో పాటు ఓ వ్యక్తి మృతి చెందారు. మరో ఐదుగురు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.
సీనియర్ పోలీసు అధికారులు, బలగాలు ఆ ఘటన స్థలానికి చేరుకున్నారు. బాధ్యులు ఎవరనేది గుర్తించి, వారిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను జనవరి 8న ప్రకటించిన తర్వాత శనివారం రాత్రి జరిగిన బాంబు పేలుడు ప్రమాదం మొదటి హింసాత్మక ఘటన. 60 స్థానాలున్న మణిపూర్ అసెంబ్లీకి ఫిబ్రవరి 28, మార్చి 5 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.