Mann Ki Baat: 'ప్రొఫైల్ ఫిక్స్ గా త్రివ‌ర్ణ ప‌తాకాన్ని పెట్టుకోండి' ప్ర‌ధాని మోడీ పిలుపు

By Rajesh KFirst Published Jul 31, 2022, 12:47 PM IST
Highlights

Mann Ki Baat: ప్రధాని నరేంద్ర మోదీ నేడు  మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా దేశప్రజలతో మరోసారి సంభాషించారు. ఈసారి ప్రధాని మోదీ స్వాతంత్ర్య అమృత్ మహోత్సవ్ కార్యక్రమం గురించి మాట్లాడుతున్నారు. సోష‌ల్ మీడియా ప్రొఫైల్ ఫిక్స్ గా త్రివ‌ర్ణ పతాకాన్ని ప్ర‌ద‌ర్శించాలని దేశ ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. 

 

Mann Ki Baat: మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి దేశప్రజలతో సంభాషిస్తున్నారు. నేడు( జూలై 31) న నిర్వ‌హించిన 91వ మన్ కీ బాత్ కార్యక్రమంలో వివిధ అంశాలపై మాట్లాడారు. ప్ర‌ధానంగా స్వాతంత్య్ర‌ అమృత్ మహోత్సవ్ కార్యక్రమం గురించి మాట్లాడారు. నేటీ  'మన్ కీ బాత్' చాలా ప్రత్యేకమైనదని, భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకోను సంద‌ర్భంగా నిర్వ‌హిస్తున్న‌ వేడుక‌లు చారిత్రాత్మక క్షణానికి సాక్ష్యంగా నిలుస్తాయని ప్రధాని మోదీ అన్నారు. 

ఈ సంద‌ర్భంగా దేశం కోసం ప్రాణాలర్పించిన స్వాతంత్య్ర స‌మర యోధులంద‌రికీ  వినయపూర్వకమైన నివాళులు అర్పించే సంద‌ర్భ‌మ‌ని గుర్తు చేశారు. 75 ఏండ్ల‌ స్వాతంత‍్య్రానికి గుర్తుగా దేశంలోని 75 రైల్వే స్టేషన్లకు స్వాతంత్య్ర సమరయోధుల పేర్లు పెట్టినట్లు గుర్తు చేశారు. ప్ర‌ధాన మంత్రి మోదీ ఇంకా మాట్లాడుతూ.. “అమృత్ స్వాతంత్య్ర‌ ఉత్స‌వం ఒక సామూహిక ఉద్య‌మం రూపాన్ని తీసుకోవ‌డాన్ని చూసి చాలా సంతోషిస్తున్నాన‌నీ అన్నారు. ఈ ఉత్స‌వంలో అన్ని వర్గాల ప్రజలు వివిధ కార్యక్రమాలలో పాల్గొంటున్నారని తెలిపారు.
 
స్వాతంత్య్ర అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఆగస్టు 13 నుంచి 15 వరకు  'హర్ ఘర్ తిరంగ' నిర్వహించ‌బ‌డుతుంద‌నీ, ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా ఆగస్టు 13 నుండి 15 వరకు ప్ర‌తి భార‌తీయుడు  త‌మ‌ ఇంటి వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలనీ, లేదా  త‌మ‌ ఇంటి ముందు త్రివ‌ర్ణ ప‌తాకాన్ని పెట్టుకోవాలని పిలుపునిచ్చారు. 

అదే స‌మ‌యంలో ఆగస్ట్ 2 నుండి ఆగస్టు 15 వరకు..ప్ర‌తి భార‌తీయుడు త‌న‌ సోషల్ మీడియా ప్రొఫైల్ ఫిక్స్ లో త్రివర్ణ పతాకాన్ని ప్ర‌ద‌ర్శించాల‌ని  పిలుపునిచ్చారు. ఈ సంద‌ర్బంగా.. జాతీయ పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్యను స్మరించుకున్నారు. ఆయ‌న‌ జయంతి ఆగస్టు 2న కావున ఆయనకు నా గౌరవప్రదమైన నివాళులు అర్పిస్తున్నానని అన్నారు. 

ప్రపంచ స్థాయిలో కరోనాకు వ్యతిరేకంగా ఆయుష్ కీలక పాత్ర పోషించిందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఆయుర్వేదం,  భారతీయ ఔషధాల పట్ల ఆకర్షణ పెరుగుతోందనీ, ఇటీవల, గ్లోబల్ ఆయుష్ ఇన్వెస్ట్‌మెంట్ & ఇన్నోవేషన్ సమ్మిట్ జరిగింది. ఇందులో దాదాపు 10 వేల కోట్ల రూపాయల పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయి. ఇండియన్ వర్చువల్ హెర్బేరియం జూలై నెలలో ప్రారంభించబడింది. మన మూలాలతో డిజిటల్ ప్రపంచంతో కనెక్ట్ అవ్వడానికి ఎలా ఉపయోగించవచ్చో కూడా ఇది ఒక ఉదాహరణ అని అన్నారు. 

అదే స‌మ‌యంలో రైతుల గురించి మాట్లాడుతూ.. తేనె ఉత్ప‌త్తులు రైతుల జీవితాలను మారుస్తుంది. వారి ఆదాయాన్ని పెంచుతుంది. తేనె మనకు రుచిని మాత్రమే కాదు, ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. నేటికి తేనె ఉత్పత్తిలో అనేక అవకాశాలు ఉన్నాయి, వృత్తిపరమైన విద్యను అభ్యసిస్తున్న యువత కూడా దానిని తమ స్వయం ఉపాధిగా చేసుకుంటున్నార‌ని తెలిపారు. మ‌న దేశంలోని నిర్వ‌హించే జాతరలు మ‌న సంస్కృతికి నిద‌ర్శ‌మ‌నీ, జాతరలు ప్రజలను, మనస్సును రెండింటినీ కలుపుతాయని అన్నారు. స్టార్ట‌ప్ ల‌కు గురించి మాట్లాడుతూ.. మ‌న దేశ యువ‌కులు ఎన్నో విజయాలను సాధించార‌నీ, ఎవరూ ఊహించలేరని అన్నారు. దేశ‌వ్యాప్తంగా వోకల్ ఫర్ లోకల్ అనే ప్రతిధ్వని వినిపిస్తోందని అన్నారు. 

అనంత‌రం క్రీడాకారులు, విద్యార్థుల గురించి ప్ర‌ధాని మాట్లాడారు. నేడు మన యువత ప్రతి రంగంలోనూ దేశం గర్వించేలా చేస్తున్నారనీ అన్నారు. ఈ నెలలో పీవీ సింధు సింగపూర్ ఓపెన్ టైటిల్‌ను కైవసం చేసుకుందనీ, అలాగే.. తన అద్భుతమైన ప్రదర్శనతో నీరజ్ చోప్రా ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో దేశానికి రజత పతకాన్ని సాధించాడని ప్ర‌శంసించారు. అలాగే.. చెన్నైలో 44వ చెస్ ఒలింపియాడ్‌కు ఆతిథ్యం ఇవ్వడం భారత్‌కు గొప్ప గౌరవమ‌ని అన్నారు. దేశవ్యాప్తంగా 10,  12 తరగతుల ఫలితాలు కూడా ప్రకటించబడ్డాయనీ,  కృషి, అంకితభావంతో ఘ‌న విజయం సాధించిన విద్యార్థులందరినీ అభినందిస్తున్నాన‌ని అన్నారు.

click me!