మనీష్ సిసోడియాను 9 గంటల పాటు విచారించిన సీబీఐ.. 100 మంది నేతల అరెస్టు !

By Rajesh KarampooriFirst Published Oct 17, 2022, 11:06 PM IST
Highlights

Manish Sisodia: ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియాపై సీబీఐ ప్రశ్నల వర్షం కురిపించింది. ఆయనను రెండు దశల్లో  సీబీఐ దాదాపు 9 గంటల పాటు ప్రశ్నించారు.సీబీఐ హెడ్ క్వార్టర్స్ వద్దకు ఉదయం 11.00 గంటలకు మనీష్ సిసోడియా చేరుకున్నారు.

Manish Sisodia: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాపై సీబీఐ ప్రశ్నల వర్షం కురిపించింది. సోమవారం (అక్టోబర్ 17)న రెండు దశల్లో సుమారు 9 గంటల పాటు సిసోడియాను సీబీఐ ప్రశ్నించింది. 

ఎక్సైజ్ పాలసీ కేసులో విచారణ నిమిత్తం ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సోమవారం ఉదయం 11:15 గంటలకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. అంతకుముందు ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కార్యాలయం, మహాత్మా గాంధీ స్మారక ప్రదేశమైన రాజ్ ఘాట్‌ను సందర్శించారు.

మనీష్ సిసోడియాను సీబీఐ రెండు దశల్లో విచారించింది. మొదటి దశ విచారణ దాదాపు మూడున్నర గంటల పాటు సాగింది.అనంతరం అరగంట భోజన విరామం అనంతరం దాదాపు 6 గంటల పాటు విచారణ చేపట్టింది. 

సిబిఐ కార్యాలయం నుండి బయటకు వచ్చిన తర్వాత, మనీష్ సిసోడియా మాట్లాడుతూ.. ఆపరేషన్ లోటస్‌ను విజయవంతం చేయడానికి తనపై బీజేపీ అక్రమ కేసు పెట్టినట్లు విమర్శించారు. తనపై ఏ కేసు పెట్టిన భయపడే ప్రసక్తే లేదని, తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదనీ, అప్పుడు ఇలాంటి కేసులు ఎలా కొనసాగుతాయని అన్నారు. ఢిల్లీలో 10 వేల కోట్ల ఎక్సైజ్ కుంభకోణం జరిగిందని పదే పదే చెబుతున్నారనీ, నేడు సీబీఐకి వెళ్లి చూస్తే ఈ కేసు మొత్తం ఫేక్ అని, ఆపరేషన్ లోటస్‌ని విజయవంతం చేసేందుకు సీబీఐలో కేసు పెట్టారని తనకు  అర్థమైందని అన్నారు.

సీబీఐ లాంటి ఏజెన్సీని రాజ్యాంగ విరుద్ధమైన రీతిలో వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు.ఎక్సైజ్‌పై చర్చ జరిగిందనీ, ఈ సమయంలో తనని ఆప్ ను వదిలివేయమని,లేకుంటే తనపై అలాంటి కేసులు నమోదవుతూనే ఉంటాయని బెదిరించారని ఆరోపించారు. సత్యేంద్ర జైన్‌పై అసలు కేసులేమిటో చెప్పాననీ, తనను ఆమ్ ఆద్మీ పార్టీని (ఆప్‌) వదిలి బీజేపీలోకి వెళ్లనని చెప్పాననీ స్పష్టం చేశానని తెలిపారు. కానీ,  బీజేపీలోకి వెళ్తే..తనని సీఎం చేస్తానన్నారనీ ఆరోపించారు. తమ ప్రభుత్వంలో పెదవారి పిల్లలు మంచి చదువులు చదివితే చాలా సంతోషంగా ఉందనీ, ఎక్కడా ఒక్క రూపాయి కుంభకోణం జరగలేదని వివరించారు.

ఇదిలా ఉంటే.. ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సమాధానాలను సిబిఐ మూల్యాంకనం చేస్తుందని, అవసరమైతే.. తరువాత మళ్లీ పిలుస్తామని ఏజెన్సీ అధికారి తెలిపారు. రేపటికి సిసోడియాకు సమన్లు ​​ఇవ్వలేదని తెలిపారు. 

మనీష్ సిసోడియా విచారణ కోసం బయలుదేరే ముందు అతని మద్దతుదారులు పెద్ద సంఖ్యలో అతని నివాసం వెలుపల గుమిగూడారు. ఆ సమయంలో సిసోడియా తన మద్దతుదారులతో మాట్లాడుతూ.. తాను జైలుకు వెళ్లడం గర్వంగా ఉందనీ, అరెస్టుకు భయపడేది లేదని అన్నారు. సీబీఐ కార్యాలయానికి వెళ్లే ముందు మనీష్ సిసోడియా మధుర రోడ్డులోని తన నివాసంలో తన తల్లి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం మహాత్మా గాంధీ సమాధి అయిన రాజ్ ఘాట్‌ను కూడా సందర్శించారు.

ఈ నేపథ్యంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేస్తూ.. డిసెంబర్ 8న గుజరాత్ ఫలితాలు వెలువడనున్నాయి. గుజరాత్ ఎన్నికల్లో మనీష్ ప్రచారానికి వెళ్లని చేపే వరకు ఆయనను జైల్లో ఉంచుతారు." అని అన్నారు. 

అలాగే.. గుజరాత్‌లోని మెహసానా జిల్లాలో సోమవారం జరిగిన బహిరంగ సభలో కేజ్రీవాల్ మాట్లాడుతూ.. గుజరాత్‌కు వచ్చిన తర్వాత మనీష్ సిసోడియా గుజరాత్‌లోని ప్రతి గ్రామంలో ఢిల్లీ వంటి పాఠశాలలు నిర్మిస్తామని చెప్పారని అన్నారు. కానీ నేడు మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేసింది.డిసెంబర్ 8న ఫలితాలు వెలువడగానే జైలు తాళాలు పగలగొట్టి మనీష్ సిసోడియా విడుదలవుతారని ఆరోపించారు. 

2021-22 అమలులో ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ అవకతవకలపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సీబీఐ విచారణకు సిఫార్సు చేశారు. ఆ తర్వాత ఆగస్టులో సిసోడియాతో పాటు మరో 14 మందిపై భారత శిక్షాస్మృతి, అవినీతి నిరోధక చట్టంలోని వివిధ సెక్షన్ల కింద సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.

FIR నమోదు తర్వాత, ఏజెన్సీ ఆగస్టులో మనీష్ సిసోడియా ప్రాంగణాలపై దాడి చేసింది, ఘజియాబాద్‌లోని బ్యాంకులో అతని లాకర్‌ను కూడా సోదా చేసింది. దీంతో పాటు పలు రాష్ట్రాల్లో దాడులు కూడా జరిగాయి. ఈ కేసులో ఆప్ నేత, ఓన్లీ మచ్ లౌడర్ మాజీ సీఈవో విజయ్ నాయర్, హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అభిషేక్ బోయిన్‌పల్లిని కూడా సీబీఐ అరెస్ట్ చేసింది.

సిసోడియాను ప్రశ్నించడంపై ఆప్ కార్యకర్తలు సిబిఐ కార్యాలయం వెలుపల ప్రదర్శన చేశారు. ఆప్ నాయకులు, కార్యకర్తలను ఇక్కడి నుంచి తరలించాలని, లేకుంటే బలవంతంగా తొలగించాల్సి వస్తుందని పోలీసులు హెచ్చరించారు. అనంతరం పోలీసులు ప్రజలను తొలగించడం ప్రారంభించారు. ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన కుర్తా చిరిగిపోయిందని, తనను అణచివేస్తున్నారని సంజయ్ సింగ్ ఆరోపించారు. సిసోడియా అరెస్టు కుట్రకు ప్రజలే ఓటు ద్వారా సమాధానం చెబుతారన్నారు.

click me!