పిల్లల అక్రమ రవాణా.. మదర్ థెరిస్సా మిషనరీస్ ఆఫ్ చారిటీ సంస్థలపై దర్యాప్తు

First Published Jul 17, 2018, 3:27 PM IST
Highlights

‘‘ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న’’ అంటూ దివంగత మదర్ థెరిస్సా  స్థాపించిన మిషనరీస్ ఆఫ్ చారిటీ సంస్థపై కేంద్రప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది

‘‘ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న’’ అంటూ దివంగత మదర్ థెరిస్సా  స్థాపించిన మిషనరీస్ ఆఫ్ చారిటీ సంస్థపై కేంద్రప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది.. ఇటీవల జార్ఖండ్ రాష్ట్రలోని రాంచీలో చిన్నారులను అక్రమంగా విక్రయించిన ఘటనలో అనేక అనుమానాలు రేకెత్తడంతో కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ అప్రమత్తమైంది.

దేశవ్యాప్తంగా మిషనరీస్ ఆఫ్ చారిటీ కింద నడిచే చైల్డ్  కేర్ హోమ్స్‌లపై విచారణ జరపాల్సిందిగా  అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. దీనితో పాటుగా అన్ని చైల్డ్ కేర్ ఇన్‌‌స్టిట్యూషన్లను సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీకి లింక్ చేయాలని సూచించింది.

కొద్దిరోజుల  క్రితం జార్ఖండ్ రాజధాని రాంచీలో మదర్ థెరిస్సా మిషనరీస్ ఆఫ్ చారిటీలో శిశువుల విక్రయాలు జరిగాయాని... పలు హోమ్‌లలో వందలాది మంది నవజాత శిశువులకు సంబంధించిన రికార్డులు మాయమయ్యాయంటూ ఆరోపణలు రావడం కలకలం రేపింది. తమకు శిశువును ఇస్తామని చెప్పి లక్ష రూపాయలకు పైగా తీసుకున్నారని.. న్యాయస్థానం విధివిధానాల తర్వాత బిడ్డను అప్పగిస్తామని ఇప్పటి వరకు ఇవ్వలేదని ఓ దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దేశవ్యాప్తంగా కలకలం రేపింది.

ఈ వ్యవహారంలో చారిటీలో పనిచేస్తున్న ఓ మహిళను... ఈ నెల 9న మరో మహిళను.. ఇద్దరు సిస్టర్లను అదుపులోకి తీసుకోగా.. విస్తు గొలిపే నిజాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల కస్టడిలో ఉన్న ఇద్దరు సిస్టర్లలో ఒకరు తాను ఇద్దరు చిన్నారులను విక్రయించినట్లు తెలిపారు. ఈ ఘటనతో మిషనరీస్ ఆఫ్ చారిటీపై అనుమానాలు తలెత్తడంతో కేంద్రమంత్రి మేనకా గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు.  
 

click me!