
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండటంతో కొందరు వాహనదారులు ఎలక్ట్రిక్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. అయితే ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తున్న కొందరు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవలికాలంలో కొన్నిచోట్ల ఎలక్ట్రిక్ బైక్‌ల్లో మంటలు చెలరేగిన ఘటనలను కూడా చూస్తున్నాం. అయితే తాజాగా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసిన వ్యక్తి.. అది పనిచేయకపోవడంతో వినూత్నంగా నిరసన వ్యక్తం చేశాడు. ఎలక్ట్రిక్ స్కూటర్‌కు గాడిదని కట్టి.. ఆ కంపెనీని నమ్మవద్దని కోరుతూ తనదైన శైలిలో నిరసన తెలిపాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో చోటుచేసుకుంది.
ఏబీసీ న్యూస్ రిపోర్ట్ ప్రకారం.. బీడ్ జిల్లాకు చెందిన సచిన్ గిట్టే అనే వ్యక్తి ఓలా కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు చేశాడు. అయితే కొనుగోలు చేసిన కొద్ది రోజుల తర్వాత వాహనం మొరాయించింది. దీంతో అతడు కంపెనీ కస్టమర్ కాల్ సెంటర్‌కు కాల్ చేశాడు. అయితే అక్కడి నుంచి అతడు ఆశించిన స్పందన రాలేదు. దీంతో తీవ్ర అసంతృప్తికి లోనయ్యాడు.
ఈ క్రమంలోనే తన ఎలక్ట్రిక్ స్కూటర్‌కు గాడిదను కట్టి రోడ్డుపై నిరసన తెలియజేశాడు. ‘‘మోసపూరిత ఓలా కంపెనీతో జాగ్రత్తగా ఉండండి’’, ‘‘ఓలా కంపెనీ ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేయకండి’’ అని రాసి ఉంచిన బ్యానర్లను ప్రదర్శించాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాతో వైరల్‌గా మారాయి. ఓ స్థానిక మరాఠి చానల్ షేర్ చేసిన వీడియోలో.. బైక్‌ను గాడిద లాగినట్టు కనిపిస్తుంది.
మరోవైపు సచిన్ గిట్టే.. వినియోగదారుల ఫోరమ్‌ను కూడా సంప్రదించి ఈ విషయంపై ఫిర్యాదు చేశాడు. ఓలా కంపెనీ బైక్ రిపేర్ గానీ, రిప్లేస్ గానీ చేయలేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఓలా నుంచి వినియోగదారులకు ఎలాంటి ఆర్థిక రక్షణ లేదని ఆరోపించిన అతడు... ప్రభుత్వం విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరాడు. ఇక, సచిన్ గిట్టె.. 2021 సెప్టెంబర్‌లో స్కూటర్‌ను బుక్ చేసుకున్నాడు.. అది 2022 మార్చి 24న డెలివరీ చేయబడింది.
ఇక, ఎలక్ట్రిక్ వాహనాల్లో మంటలు చెలరేగుతున్న ఘటనలు పెరుగుతన్నట్టుగా నివేదికలు రావడంతో.. ఓలా కీలక నిర్ణయం తీసుకుంది. కంపెనీకి చెందిన 1,441 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు రీకాల్ చేస్తున్నట్టుగా ఏప్రిల్ 24న ఓలా కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ స్కూటర్‌లను కంపెనీ సర్వీస్ ఇంజనీర్లు అంచనా వేస్తారని పేర్కొంది.