కన్న కూతురిపై దాడి చేయించి, దుస్తులు చింపేసి...

By telugu news teamFirst Published May 13, 2020, 1:48 PM IST
Highlights

 కరోనా లాక్ డౌన్ తో వాళ్లు తమ ఇంటికి వెళ్లలేకపోయారు.అమృత తండ్రి భైరప్ప తన పొలంలో మట్టిని తవ్వించి వేరే వారికి విక్రయించడం జరిగింది.  ఈ విషయమై అమృత తండ్రిని ప్రశ్నించగా ఇద్దరి మధ్య గొడవ జరిగింది.

ఎలాంటి పరిస్థితుల్లోనైనా తండ్రి అనేవాడు కన్నకూతురిని ఎలా కాపాడుకోవాలా అని చూస్తుంటాడు. పెళ్లి చేసి అత్తారింటికి పంపినా కూడా తండ్రి కి కూతురిపై ప్రేమ ఏ మాత్రం తగ్గదు అని చెబుతుంటారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. మనిషికి మానవ సంబంధాలకు మించి డబ్బు మీద ప్రేమ ఎక్కువైపోయింది. ఈ డబ్బు వ్యామోహంలో కన్న కూతురు, అల్లుడు అనే తేడా కూడా లేదు. ఇలాంటి సంఘటనే తాజాగా కర్ణాటకలో చోటుచేసుకుంది. డబ్బు కోసం ఓ వ్యక్తి కన్న కూతురిపైనే దాడి చేయించాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే... కర్ణాటక రాష్ట్రం తమకూరు జిల్లా లోని తిపటూరు తాలుకాలోని గోపాలపుర గ్రామానికి చెందిన అమృతకు ఆరేళ్ల క్రితం బెంగళూరుకు చెందిన సునీల్ తో వివాహమైంది. కాగా.. ఆమె మార్చి నెలలో గోపాలపుర గ్రామంలో ఉంటున్న తండ్రి ఇంటికి భర్తతో కలిసి వచ్చింది.

అయితే.. కరోనా లాక్ డౌన్ తో వాళ్లు తమ ఇంటికి వెళ్లలేకపోయారు.అమృత తండ్రి భైరప్ప తన పొలంలో మట్టిని తవ్వించి వేరే వారికి విక్రయించడం జరిగింది.  ఈ విషయమై అమృత తండ్రిని ప్రశ్నించగా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దాంతో అమృత న్యాయం కోసం నోవినకెరె పోలిసు స్టేషన్‌కు వెళ్ళి ఫిర్యాదు చేశారు.

పోలీస్‌ స్టేషన్‌ నుంచి ఇంటికి వచ్చిన అమృత, తండ్రి భైరప్పల మధ్య మళ్ళి ఘర్షణ తలెత్తింది. ఆగ్రహానికి గురైన భైరప్ప తన అన్నదమ్ములను బంధువులను పిలిపించి కట్టెలు, కత్తులతో అమృత పైన దాడి చేయించాడు. అమృత తల, భుజాలకు గాయాలై రక్తం ధార కట్టింది. భర్త సునీల్‌కు కూడా గాయాలు కావడంతో ఇద్దరు తిపటూరులో ఉన్న అస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

click me!