
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌లో టోల్ బూత్‌లో పని చేస్తున్న ఉద్యోగినిపై ఓ వ్యక్తి దాడి చేశాడు. టోల్ చార్జీ కట్టాలని అడిగినందుకు తాను లోకల్ అని, చార్జీ నుంచి మినహాయించాలని అన్నాడు. కానీ, ఆయనను ఎప్పుడూ చూడలేదని ఆమె అన్నారు. ఈ వాదనలే ముదిరి వివాదానికి దారి తీశాయి. ఆ వ్యక్తి సదరు మహిళా ఉద్యోగి చెంపపై కొట్టాడు. ఆమె అంతే వేగంగా టోల్ బూత్‌లో నుంచే చెప్పు తీసి అతన్ని కొట్టింది. బూత్‌లోని సీసీటీవీలో రికార్డ్ అయిన ఈ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గడ్, భోపాల్ రోడ్డు పై కచనరియా టోల్ ప్లాజా దగ్గర శనివారం చోటుచేసుకుంది.
కచనరియా టోల్ ప్లాజా దగ్గరకు రాజ్‌కుమార్ గుర్జార్ కారు వచ్చింది. ఆయన కారుకు ఫాస్టాగ్ లేదు. టోల్ బూత్‌లో ఉన్న మహిళా ఉద్యోగి చార్జీ కట్టాలని అడిగింది. దానికి ఆయన లోకల్ వ్యక్తేనని, తనకు టోల్ చార్జీ నుంచి మినహాయింపు ఇవ్వాలని అన్నాడు. తాను లోకల్ వ్యక్తినే అని నిరూపించుకునే డాక్యుమెంట్లకు ఆయన దగ్గర లేవు.
ఘటన అనంతరం టోల్ బూత్ ఉద్యోగిని అనురాధా డాంగి మాట్లాడారు. ‘ఆయన తాను లోకల్ అని చెప్పాడు. కానీ, నాకు మీరు ఎవరో తెలియదు అన్నాను. ఈ విషయాన్ని నేను మా సూపర్‌వైజర్‌కు తెలియజేశాను. ఆ వ్యక్తి నాకు తెలుసా అని సూపర్‌వైజర్ అడిగాడు. నాకు తెలియదు అని నేను అన్నాను. దీంతో ఆ వ్యక్తి కారు నుంచి బయటకు దిగతి వచ్చి నన్ను దూషించాడు, కొట్టాడు. నేను కూడా ఆయనను కొట్టాను’ అని తెలిపారు.
ఆ బూత్‌లో మొత్తం ఏడుగురు మహిళా ఉద్యోగులు ఉన్నారని తెలిపారు. కానీ, వారి రక్షణ కోసం ఎలాంటి ఏర్పాట్లు లేవని వివరించారు.
ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందింది. నిందితుడిపై కేసు నమోదైంది. ఇంకా నిందితుడిని అరెస్టు చేయాల్సి ఉన్నది.
స్థానిక పోలీసు స్టేషన్ ఇంచార్జీ రామ్ కుమార్ రఘువంశీ మాట్లాడుతూ, ‘టోల్ ప్లాజా మహిళా ఉద్యోగి ఫిర్యాదు ఇచ్చింది. అనురాధా డాంగి ఆ వ్యక్తిపై రాతపూర్వక ఫిర్యాదు సమర్పించింది. ఆ ఫిర్యాదు ఆధారంగా మేం కేసు నమోదు చేశాం. నిందితుడిని ఇంకా అరెస్టు చేయాల్సి ఉన్నది’ అని వివరించారు.