జయలలిత కేసులో కీలక పురోగతి.. ‘హాస్పిటల్ అందించిన చికిత్సలో తప్పిదాలు లేవు’

By Mahesh KFirst Published Aug 21, 2022, 6:57 PM IST
Highlights

తమిళనాడు మాజీ సీఎం జయలలిత మరణానికి సంబంధించి దర్యాప్తులో కీలక పురోగతి లభించింది. ఆమెకు చివరి రోజుల్లో అపోలో హాస్పిటల్ అందించిన చికిత్సలో ఎలాంటి లోపాలు, తప్పిదాలు లేవని ఎయిమ్స్ కమిటీ నివేదిక ఇచ్చింది.

న్యూఢిల్లీ: తమిళనాడు మాజీ సీఎం జయలలిత మరణం చుట్టూ అనేక అనుమానాలు ముసురుకున్న సంగతి తెలిసిందే. ఆమె మరణం తర్వాత చోటుచేసుకున్న రాజకీయ, ఇతర పరిణామాల నేపథ్యంలో సందేహాలు ఎక్కువ అయ్యాయి. ముఖ్యంగా ఆమెకు హాస్పిటల్‌లో చికిత్స అందించిన కాలానికి సంబంధించే చాలా మంది చాలా రకాలుగా ఇప్పటికీ వాదిస్తుంటారు. ఈ అనుమానాలన్నింటికీ ఫుల్ స్టాప్ పెడుతూ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పడ్డ ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) కమిటీ నివేదిక అందించింది. జయలలితకు అందించిన చికిత్సలో ఎలాంటి తప్పిదాలు, లోపాలు లేవని, ఆమెకు సరైన చికిత్స అందించారని స్పష్టం చేసింది. దీంతో జయలలితకు చికిత్స అందించిన అపోలో హాస్పిటల్‌కు ఉపశమనం లభించినట్టయింది.

జయలలిత మరణం తర్వాత వెలువడ్డ అనేక అనుమానాల నేపథ్యంలో మాజీ సీఎం ఓ పనీర్‌సెల్వం ఆమె మరణంపై దర్యాప్తు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఆయన విజ్ఞప్తి కారణంగా జయలలిత మరణాన్ని దర్యాప్తు చేయడానికి అరుముఘమ్ స్వామి కమిషన్ ఏర్పడింది. 2017 నవంబర్‌లో ఈ కమిషన్ దర్యాప్తు ప్రారంభించింది. ఆమెకు వైద్యం అందించిన వైద్యులు, అప్పటి అధికారులు, మంత్రులు, లీడర్లు, ఇతరుల నుంచి స్టేట్‌మెంట్లు రికార్డు చేసుకుంది. సుమారు 157 మంది తమ స్టేట్‌మెంట్లు కమిషన్‌కు ఇచ్చారు.

ఈ కమిషన్ దాని పరిధి దాటి తమను ప్రశ్నిస్తున్నదని, ఈ దర్యాప్తు నుంచి తమకు స్టే ఇవ్వాలని అపోలో హాస్పిటల్ 2019లో మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. కానీ, ఈ విజ్ఞప్తిని కోర్టు కొట్టేసింది. సుప్రీంకోర్టు మాత్రం మద్రాస్ హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా అరుముఘమ్ కమిషన్‌కు అసిస్ట్ చేయడానికి కమిటీ ఏర్పాటు చేయాలని ఎయిమ్స్‌ను ఆదేశించింది. ఈ కమిటీ తాజాగా అపోలో అందించిన చికిత్సలో లోపాలు, తప్పిదాలు లేవని స్పష్టం చేసింది.

మెడికల్ రికార్డుల ప్రకారం ఫైనల్ డయాగ్నోసిస్‌తో బ్యాక్టెరెమియా, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్‌తో సెప్టిక్ షాక్‌‌ను కనుగొన్నట్టు ప్యానెల్ తెలిపింది. హార్ట్ ఫెయిల్యూర్‌కూ ఆధారాలు ఉన్నాయని వివరించింది. ఆమె అడ్మిట్ అయినప్పుడు నియంత్రణలేని డయాబెటిస్ ఉండేదని, దానికి చికిత్స ఇచ్చారని తెలిపింది. హైపర్‌టెన్షన్, హైపర్ థైరాయిడ్, అస్థమాటిక్, ఇరిటేబుల్ బోయెల్ సిండ్రోమ్, అటోపిక్ డెర్మటిటిస్‌లూ ఉన్నట్టు మెడికల్ ప్యానెల్ తెలిపింది.

click me!