
అహ్మదాబాద్: గుజరాత్ లోని అహ్మదాబాదులో సభ్య సమాజం తల దించుకునే సంఘటన జరిగింది. తన చెల్లెలిపై ఓ యువకుడు మూడేళ్లుగా అత్యాచారం చేస్తూ వచ్చాడు. ఈ విషయాన్ని ఆ బాలిక వదిన కారణంగా వెలుగు చూసింది. అహ్మదాబాదులో 15 ఏళ్ల బాలిక తల్లితో కలిసి నివాసం ఉంటోంది. ఆమె తంర్డి 14 ఏళ్ల క్రితం మరణించాడు. ఇటీవల తల్లి కూడా మరణించింది.
తల్లిదండ్రులను కోల్పోయిన బాలికను ఆమె పెద్దన్నయ్య (26) మకార్బాలోని తన ఇంటికి తీసుకుని వెళ్లాడు. అయితే, అతను తన వక్రబుద్ధిని ప్రదర్శించి అత్యంత నీచానికి ఒడిగట్టాడు. బాలిక నిస్సహాయతను ఆసరా చేసుకుని ఆమెపై మూడేళ్లుగా అఘాయిత్యానికి పాల్పడుతూ వస్తున్నాడు.
మూడు నెలలుగా బాలికకు నెలసరి రాకపోవడంతో ఆమె వదినకు అనుమానం వచ్చింది. ఆమెను ఆస్పత్రికి తీసుకుని వెళ్లి డాక్టర్ కు చూపించింది. పరీక్షల్లో బాలిక గర్భం దాల్చినట్లు తేలింది. దాంతో ఆ విషయంపై బుధవారం సర్కేజ్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
2019 జనవరి 29వ తేదీ నుంచి తనపై అన్నయ్య అత్యాచారానికి పాల్పడుతున్నాడని, తను ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో లేదా అతని భార్య పడుకున్న సమయంలో అన్నయ్య అఘాయిత్యానికి పాల్పడేవాడని ఆమె తన ఫిర్యాదులో చెప్పింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.