ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే ప్రతిఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని చెబితే ప్రజలు వినడంలేదు. అందువల్లే వారికి పోలింగ్ బూతులకు తరలించేందుకు వినూత్న ఆలోచన చేసింది ఎన్నికల సంఘం...
ప్రస్తుతం ఎండలే కాదు రాజకీయాలు కూడా హాట్ హాట్ గా వున్నాయి. మండుటెండల్లోనూ గెలుపే లక్ష్యంగా రాజకీయ పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. కానీ ఓటర్లను పోలింగ్ బూత్ ల వరకు తీసుకురావడంలో పొలిటికల్ పార్టీలు విఫలం అవుతున్నాయి. ఈ విషయం ఇప్పటివరకే పూర్తయిన రెండు విడతల లోక్ సభ ఎన్నికల పోలింగ్ శాతాన్ని పరిశీలస్తే అర్థమవుతుంది. ఎండల ప్రభావమో లేక ఓటేసేందుకు బద్దకిస్తున్నారో తెలీదుగానీ పోలింగ్ బూతులకు వచ్చేందుకు చాలామంది ఇష్టపడటం లేదు. ఇలాంటి వారిని పోలింగ్ బూతులకు రప్పించేందుకు మధ్య ప్రదేశ్ ఎన్నికల అధికారులు సరికొత్త ఆలోచన చేసారు.
అసలు విషయం ఏమిటంటే... మధ్య ప్రదేశ్ లోని పలు లోక్ సభ నియోజకవర్గాల్లో ఇప్పటికే రెండు విడతల్లో ఎన్నికలు జరిగాయి. మరో రెండు విడతల్లోనూ అక్కడ ఎన్నికలు జరగనున్నాయి. ఇలా త్వరలోనే (మే 7) మూడో విడతలో భాగంగా 8 లోక్ సభ స్థానాల్లో పోలింగ్ జరగనుంది. అందులో భోపాల్ జిల్లాలోని లోక్ సభ స్థానాలు కూడా వున్నాయి.
undefined
అయితే గత రెండు విడతల్లో పోలింగ్ శాతం తగ్గడంతో భోపాల్ ఎన్నికల అధికారులు సరికొత్త ఆలోచన చేసారు. ఓటింగ్ శాతాన్ని పెంచాలంటే ఓటర్లను పోలింగ్ బూతులకు తరలించాలి. అందుకోసం ఓటర్లను చైతన్యం చేస్తోంది ఈసీ. అంతేకాదు ఓటు వేసినందుకు అద్భుత బహుమతులు అందించేందుకు సిద్దమయ్యారు అధికారులు.
ఎన్నికల అధికారుల సమాచారం మేరకు... ఓటు హక్కు వినియోగించుకోగానే చేతికి సిరా చుక్కతో పాటు ఓ కూపన్ అందిస్తారు అధికారులు. ఓవైపు పోలింగ్ జరుగుతుండగానే మూడుసార్లు లక్కీ డ్రా నిర్వహిస్తారు. ఇలా ఉదయం 10, మధ్యాహ్నం 3, సాయంత్రం 6 గంటలకు లక్కీ డ్రా తీసి ఓటు హక్కును ఉపయోగించుకున్నవారిలో కొందరిని విజేతలుగా ప్రకటించారు. వారికి బహుమతులు అందిస్తారు. ఆ తర్వాత మరోసారి మెగా డ్రా నిర్వహించి అందులో విజేతలుగా నిలిచినవారికి విలువైన బహుమతులు అందించనున్నారు.
అయితే ఈ ఎన్నికల ఆఫర్ లో విజేతలుగా నిలిచివారికి ఏదో బహుమతి ఇచ్చామని అనిపించుకోకుండా ఎంతో విలువైనవి ఇవ్వనున్నారు. డైమండ్ ఉంగరాలతో పాటు టివి, ప్రిడ్జ్ లాంటి బహుమతులు ఇవ్వనున్నట్లు భోపాల్ ఎన్నికల అధికారి, కలెక్టర్ కౌశలేంద్ర విక్రమ్ సింగ్ వెల్లడించారు. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఈసి చేస్తున్న ఈ వినూత్న ప్రయత్నం సక్సెస్ అవుతుందేమో చూడాలి.