
రాయ్ పూర్ :కేవలం ఐదు రూపాయల కోసం మనుషులు చంపుకుని రెండు గ్రామాల మధ్య గొడవలకు దారితీస్తుంది... ఇది త్రివిక్రమ్ డైరెక్షన్ లో జూ.ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత సినిమా స్టోరీ. అయితే ఐదు రూపాలయ కోసం చంపుకోవడం ఏమిటి..? ఇలా నిజజీవితంలో ఎక్కడైనా జరుగుతుందా? అని అనుకున్నారు. కానీ తాజాగా ఇలాంటి ఘటనే చత్తీస్ ఘడ్ లో వెలుగుచూసింది. కేవలం కోడిగుడ్ల కోసం ఓ హోటల్ యజమానికి కొందరు దుండుగులు కిడ్నాప్ చేసి చితకబాదారు.
వివరాల్లోకి వెళితే... చత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని బిలాస్ పూర్ జిల్లా బర్తోరీ గ్రామానికి చెందిన యోగేశ్ వర్మ స్థానికంగా బిర్యాని సెంటర్ నడుపుతున్నాడు. అయితే రెండ్రోజుల క్రితం అతడి హోటల్ కు పక్క గ్రామానికి చెందిన యువకులు దీపక్ చతుర్వేది, రాహుల్ కుమార్, పరమేశ్వర్ మద్యం మత్తులో వెళ్లారు. డబ్బులు లేకపోయినా కోడిగుడ్లు ఇవ్వాలని అడగడంతో అందుకు యోగేశ్ నిరాకరించాడు.
ఇలా కేవలం గుడ్లు ఇవ్వలేదన్న కోపంతో యోగేశ్ పై ముగ్గురు యువకులు కోపాన్ని పెంచుకున్నారు. అదే రోజు సాయంత్రం మళ్లీ బిర్యానీ సెంటర్ వద్దకు కారుతో చేరుకున్న ముగ్గురు యోగేశ్ ను కిడ్నాప్ చేసారు. నిర్మానుష్య ప్రాంతానికి అతడిని తీసుకెళ్లి దుర్బాషలాడుతూ చితకబాదారు. యువకుల దాడిలో యోగేశ్ తీవ్రంగా గాయపడ్డాడు.
Read More ఇదే కదా తల్లి ప్రేమంటే.. లేగను వేటాడేందుకు వచ్చిన పులినే వెంటాడిన ఆవు.. వీడియో వైరల్..
రాత్రికి యోగేశ్ ఇంటికి రాకపోవడంతో కంగారుపడిపోయిన కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కొన్ని గంటల వ్యవధిలోనే కిడ్నాపర్ల చెరనుండి యోగేశ్ ను కాపాడారు. ముగ్గురు యువకులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసారు.