కోవిడ్ తో వ్యక్తి మృతి.. అతని ఏటీఎం చోరీ చేసి...

By telugu news teamFirst Published Jun 17, 2021, 2:49 PM IST
Highlights

కోవిడ్ ప్రోటోకాల్‌ను అనుసరించి, అతని మృతదేహాన్ని డెహ్రీ మునిసిపల్ కౌన్సిల్ ఉద్యోగులు దహనం చేశారు. 

ఓ వైపు కరోనా మహమ్మారి దేశాన్ని అతలాకుతలం చేసేస్తోంది. రోజుకి వేల సంఖ్యలో మరణాలు నమోదౌతున్నాయి. మరోవైపు చనిపోయిన వారిని కూడా వదలకుండా  లూటీ చేస్తున్నారు. ఇటీవల చెన్నైలో ఓ కరోనా రోగిని డబ్బు కోసం చంపేయగా.. మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.

కరోనా తో చనిపోయిన వ్యక్తి ఏటీఎం కార్డు చోరీ చేసి..అందులోని డబ్బులు కాజేశారు. ఈ సంఘటన బిహార్ లో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

బీహార్‌లోని ససారాం జిల్లాకు చెందిన డిఎవి స్కూల్‌లో గుమాస్తాగా ప‌నిచేస్తున్న‌ అభిమన్యు కుమార్ క‌రోనా బారిన‌ప‌డి, ఏప్రిల్ 30 న డెహ్రీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కోవిడ్ ప్రోటోకాల్‌ను అనుసరించి, అతని మృతదేహాన్ని డెహ్రీ మునిసిపల్ కౌన్సిల్ ఉద్యోగులు దహనం చేశారు. భర్త మరణించిన తరువాత అత‌ని ఖాతా నుంచి రూ.1,06,500 ఏటీఎం ద్వారా విత్‌డ్రా చేసిన‌ట్లు మృతుని భార్య ఛాయా దేవి గుర్తించారు. 

ఆమె దరిహాట్ పోలీస్ స్టేషన్‌లో ఈ ఉదంతంపై ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశారు. పోలీసు సూపరింటెండెంట్ ఆశిష్ భారతి ఈ కేసు పరిష్కారానికి డెహ్రీ ఎస్‌డీపీవో సంజయ్ కుమార్ నాయకత్వంలో ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశారు. 

ఈ కేసులో ముందుగా శ్మశానవాటిక నిర్వాహ‌క సభ్యుడు విశాల్ డోమ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మృతదేహం దగ్గరున్న‌ ఏటీఎం కార్డును దొంగిలించి, అంత్య‌క్రియ‌ల‌కు ముందు మృతుడి ఖాతా నుంచి డబ్బును ఉపసంహరించుకున్నట్లు విశాల్ ఒప్పుకున్నాడు. ఈ ఉదంతంలో త‌న‌కు స‌హ‌క‌రించిన‌వారి పేర్లను కూడా ఆయన పోలీసుల ముందు వెల్లడించాడు. దీంతో వారిని అరెస్టు చేసి, డబ్బును స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు ప్ర‌య‌త్నిస్తున్నారు. 
 

click me!