మగబిడ్డకోసం రెండు పెళ్లిళ్లు.. అయినా కోరిక తీరకపోవడంతో.. దొంగగా మారి..

By SumaBala BukkaFirst Published Nov 9, 2022, 12:45 PM IST
Highlights

మగబిడ్డ కావాలనే కోరిక అతడిని విచక్షణ కోల్పోయేలా చేసింది. రోడ్డుపక్కన నిద్రిస్తున్న మహిళ బిడ్డను ఎత్తుకుపోయేలా చేసింది. చివరికి.. 

ఉత్తరప్రదేశ్ : మగబిడ్డ కావాలన్న కోరికతో దారుణానికి ఒడిగట్టాడో వ్యక్తి. తరతరాలుగా పేరుకుపోయిన మూఢనమ్మకాలు ఇంకా కాపురాల్లో చిచ్చుపెడుతూనే ఉన్నాయి. మగబిడ్డ లేకపోతే చులకనగా చూడడం.. తమని తాము తక్కువగా భావించడం ఇంకా సమాజంలో పోవడం లేదు. ఈ నేపథ్యంలోనే ఉత్తరప్రదేశ్లోని సహరాన్పూర్ కు చెందిన ఓ వ్యక్తి మగబిడ్డ కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాడు. మొదటి భార్యకు ముగ్గురూ ఆడపిల్లలే పుట్టడంతో రెండో వివాహం చేసుకున్నాడు. రెండో భార్యకు అసలు పిల్లలే పుట్టలేదు. దీంతో  గుళ్లు, బాబాలు,ఆశ్రమాల చుట్టూ తిరిగాడు. అయినా ఫలితం లేకపోవడంతో దొంగ గా మారాడు.  

రోడ్డు పక్కన నిద్ర పోతున్న మహిళ కొడుకును ఎత్తుకెళ్లాడు. చివరకు పోలీసులకు దొరికిపోయి, కటకటాలపాలయ్యాడు.  సహరాన్పూర్ కు చెందిన ఓం పాల్ అనే వ్యక్తి రేషన్ డీలర్ గా పని చేస్తున్నాడు. అతని మొదటి భార్యకు ముగ్గురు కుమార్తెలు పుట్టారు.  కొడుకు కావాలనే కోరికతో ఓం పాల్ చాలాచోట్ల తిరిగాడు. పండిట్ నుంచి మౌల్వీ వరకు అందరి చుట్టూ ప్రదక్షిణలు చేశాడు. అనేక ఆశ్రమాలకు కూడా వెళ్లాడు. కానీ ఫలితం లేకపోవడంతో కొడుకు కోసం రెండో వివాహం చేసుకున్నాడు. అయితే అతనికి  రెండో భార్య నుంచి అసలు సంతానమే కలగలేదు.  

తక్షణమే గవర్నర్‌ను బర్తరఫ్ చేయండి.. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కోరిన డీఎంకే

దీంతో రెండో భార్య మనస్తాపానికి గురైంది. ప్రతిరోజు ఏడుస్తూనే ఉండేది. బిడ్డను దత్తత తీసుకోవాలని పట్టుబట్టింది. ఈ క్రమంలో ఓం పాల్  ఓ ప్లాన్ వేసాడు.  బిక్షం ఎత్తుకుని జీవించే మహిళ సంతానాన్ని కిడ్నాప్ చేసి పెంచుకోవాలని అనుకున్నాడు. కిడ్నాప్ చేసే పని కోసం రూ.లక్షకు ఓ వ్యక్తితో డీల్ మాట్లాడుతున్నాడు. శుక్రవారం అర్ధరాత్రి 12 గంటలకు మిషన్ కాంపౌండ్ క్యాంపు కాలనీ  ఫుట్పాత్ పై పడుకున్న హీనా అనే మహిళ ఏడు నెలల కొడుకును దుండగుడు లాక్కుని పారిపోయాడు.  

బిక్షం ఎత్తుకునే వారి ఫిర్యాదును పోలీసులు సీరియస్ గా తీసుకోరని ఓంపాల్ ఈ ప్లాన్ కి శ్రీకారం చుట్టాడు. అయితే, అతని ఎత్తు చిత్తయ్యింది. దొంగ బిడ్డను ఎత్తుకుని పారిపోతుండగా సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది. ఆ వీడియో వైరల్ కావడంతో పోలీసులు అన్వేషణ ప్రారంభించారు. కేవలం 48 గంటల్లోనే బిడ్డను, అతనిని కిడ్నాప్ చేసిన వారిని పట్టుకున్నారు. బిడ్డను తల్లికి అప్పగించి నిందితులకు రిమాండ్ కు తరలించారు.

click me!