పెళ్లికి పిలువలేదని వరుడిని చితకబాదాడు.. లిక్కర్‌కు పైసలివ్వాలని డిమాండ్

By telugu teamFirst Published Aug 24, 2021, 6:57 PM IST
Highlights

పెళ్లికి పిలువలేదన్న కోపంతో ఓ వ్యక్తి నూతన వరుడిని చితకబాదాడు. పరిహారం కింద లిక్కర్ కొనుక్కోవడానికి రూ. 500 ఇవ్వాలని డిమాండ్ చేశాడు. వరుడు రూ. 100 ఇచ్చుకున్నాడు. అయినా వదిలిపెట్టక చావబాదాడు. ఎలాగోల తప్పించుకున్న వరుడు పోలీసులకు ఫిర్యాదునిచ్చాడు. నిందితుడు పరారీలో ఉన్నాడు. కరోనా ఇంకా వ్యాపిస్తున్నందున కుటుంబ సభ్యల మధ్యే పెళ్లి చేసుకుంటున్నానని వరుడు చెప్పినా నిందితుడు వినిపించుకోకపోవడం గమనార్హం.

భోపాల్: మధ్యప్రదేశ్‌లో వింత ఘటన చోటుచేసుకుంది. పెళ్లికి పిలువలేదని ఓ వ్యక్తి వరుడినే చితకబాదాడు. కరోనా కాబట్టి కేవలం కుటుంబ సభ్యుల మధ్యే పెళ్లి చేసుకుంటున్నానని చెప్పినా వదిలిపెట్టలేదు. వరుడిని చావబాదాడు. అంతేకాదు, లిక్కర్‌కు రూ. 500 ఇవ్వాలని డిమాండ్ చేశాడు. తలపట్టుకున్న వరుడు రూ. 100 ఇచ్చి తప్పించుకోవాలనుకున్నాడు. అవి సరిపోవని, ఇంకా ఇవ్వాలని మరో రౌండ్ వాయించాడు. వరుడు ఎలాగోలా తప్పించుకుని బయటపడి పోలీసులకు ఫిర్యాదునిచ్చాడు. మధ్యప్రదేశ్‌లో భింద్ జిల్లా
చందుపురా గ్రామంలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. 

చందుపురా గ్రామానికి చెందిన 22 ఏళ్ల కుశ్వాహ ఇటీవలే పెళ్లి చేసుకున్నాడు. కరోనా కేసులు ఇంకా రిపోర్ట్ అవుతున్న నేపథ్యంలో పెళ్లిని కేవలం కుటుంబ సభ్యుల మధ్యే జరుపుకోవాలనుకున్నాడు. అందుకే మిత్రులను, పరిచయస్తులందరినీ పెళ్లికి పిలువలేదు. పెళ్లికి పిలువకపోవడాన్ని కుశ్వాహ పరిచయస్తుడికి రుచించలేదు. వివాహానంతరం అతడిపై దాడికి దిగాడని దేహత్ పోలీసు స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ రాధేశ్యామ్ శర్మ తెలిపారు.

పెళ్లికి పిలువనందుకు పరిహారంగా లిక్కర్ కొనుక్కోవడానికి రూ. 500 ఇవ్వాల్సిందిగా వరుడిని డిమాండ్ చేశాడు. అందుకు రూ. 100 ముట్టజెప్పినా వరుడిని వదిలిపెట్టలేదు. చితక్కొట్టాడు. దీంతో వరుడి కంటితోపాటు ఇతర భాగాల్లో తీవ్రగాయాలయ్యాయి. నిందితుడిని తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదునిచ్చాడు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.

click me!