సీఎంపై విశ్వాసం లేదు.. మార్చేయండి: 31 మంది ఎమ్మెల్యేల నిర్ణయం

By telugu teamFirst Published Aug 24, 2021, 6:01 PM IST
Highlights

పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్‌ పనిపై తమకు విశ్వాసం లేదని, ఆయన స్థానంలో వేరే వ్యక్తిని భర్తీ చేయాలని కనీసం ఐదుగురు మంత్రులు సహా 36 మంది ఎమ్మెల్యేలు ఓ భేటీలో ఏకాభిప్రాయానికి వచ్చారు. ఇదే విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లనున్నట్టు విలేకరులకు వెల్లడించారు. ఐదుగురు మంత్రులు సహా ఆరుగురు సభ్యులు ఢిల్లీకి వెళ్లనున్నట్టు వివరించారు.

చండీగడ్: వచ్చే ఏడాదిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు, 2024 జనరల్ ఎలక్షన్స్‌ను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ ఒక్కో రాష్ట్రంలో పార్టీ నాయకత్వంలో అసంతృప్తిని పరిష్కరిస్తూ వస్తున్నది. ఒకదాని తర్వాత మరో రాష్ట్రంపై ఫోకస్ పెడుతూ పావులు కదుపుతున్నది. కానీ, తాజా పరిస్థితులు చూస్తే రౌండ్ తిరిగేలోపే తొలి రాష్ట్రంలో అసమ్మతులు మళ్లీ మొదటికే వచ్చేట్టుగా కనిపిస్తున్నాయి. పంజాబ్‌లో సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్, నవ్‌జోత్ సింగ్ సిద్దూపై మధ్య నెలకొన్న బేధాభిప్రాయాలను తీర్చిన కాంగ్రెస్ అధిష్టానానికి మరో చిక్కు ఎదురైనట్టు కనిపిస్తున్నది. తాజాగా, సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్‌పై, ఆయన పనితీరుపై తమకు విశ్వాసం లేదని కనీసం 31 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సమావేశమై ఏకాభిప్రాయానికి వచ్చారు. ఇదే విషయాన్ని పార్టీ అధిష్టానికి తెలిపి సీఎంను మార్చేయాలని అభ్యర్థించనున్నట్టు తెలిపారు. 

క్యాబినెట్ మంత్రి త్రిప్త్ రాజేందర్ సింగ్ బజ్వా నివాసంలో 31 మంది ఎమ్మెల్యేలు, ఆరుగురు మాజీ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. పీసీసీసీ చీఫ్ నవ్‌జోత్ సింగ్ సిద్దూ హాజరుకాలేదు. భేటీ అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను మార్చేయాలని ఏకాభిప్రాయానికి వచ్చినట్టు రాష్ట్ర మంత్రి చరంజిత్ సింగ్ చన్ని తెలిపారు. పార్టీ నుంచి ఐదుగురు మంత్రులు సహా ఆరుగురు సభ్యులు ఢిల్లీ వెళ్లి ఈ విషయాన్ని అధిష్టానికి తెలియజేయాలని నిర్ణయించుకున్నట్టు వెల్లడించారు.

సోనియా గాంధీతో ఈ విషయాన్ని చర్చించిన తర్వాతే తిరుగుప్రయాణమవుతామని వారు స్పష్టం చేశారు. ఇంకా అపాయింట్‌మెంట్ తీసుకోలేదని వివరించారు. కెప్టెన్ అమరీందర్ సింగ్ ఏ పనీ చేయలేదని, హామీలనూ నెరవేర్చడం సాధ్యపడలేదని అన్నారు. తమకు మరో అవకాశం లేదని, అందుకే సీఎంను మార్చాలన్న అభిప్రాయానికి వచ్చినట్టు తెలిపారు.

ఈ భేటీకి మొత్తం 46 మంది ఎమ్మెల్యేలు హాజరైనట్టు మంత్రి బజ్వా వివరించారు. ఇంకా చాలా మంది సీఎంపై వ్యతిరేకతను కలిగి ఉన్నారని, కానీ బాహాటంగా మీటింగ్‌లో పాల్గొనడానికి వారు నిరాకరించారని తెలిపారు. తమకు గాంధీ అపాయింట్‌మెంట్ లేదని, కానీ, ఇన్‌చార్జీ జనరల్ సెక్రెటరీ దగ్గర ఈ అంశాన్ని లేవనెత్తుతామని వివరించారు. గాంధీతో సమావేశాన్ని నిర్వహించేలా ఒత్తిడి తెస్తామని తెలిపారు.

click me!