రక్తాలు కారేలా భార్యపై దాడి, వీడియో వైరల్.. భర్త అరెస్ట్..

By SumaBala BukkaFirst Published Oct 20, 2022, 7:55 AM IST
Highlights

తనకిష్టం లేకున్నా ఉద్యోగానికి వెడుతుందని ఓ భార్యను భర్త చితకబాదాడు. రక్తమోడేలా కొట్టాడు. ఈ వీడియో ఇంటర్నెట్ లో హల్ చల్ చేసింది. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.

తిరువనంతపురం : కేరళలోని తిరువనంతపురం జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మహిళలపై జరుగుతున్న అకృత్యాల్లో గృహహింస అత్యంత ముఖ్యమైంది. భర్త చెప్పినట్టు వినలేదనో.. ఇష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించిందనో.. అదనపు కట్నం కోసమో, ఆడపిల్ల పుట్టిందనో.. ఇలా అనేక కారణాలతో నిత్యం వివాహిత మహిళలు హింసలపాలవుతూనే ఉన్నారు. తాజాగా అలాంటి ఓ వీడియో ఇంటర్నెట్ లో చక్కర్లు కొట్టింది. దీంతో ఆ వీడియోలో ఉన్న సదరు భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు.

అందులో ఏముందంటే తన భార్యను ఓ భర్త చితకబాదుతున్నాడు. ఆ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అయ్యింది. దీంతో పోలీసులు ఆ వీడియోను పరిశీలించి సదరు వ్యక్తిని అరెస్ట్ చేశారు. తన భార్యను దారుణంగా కొట్టి, వీడియో తీసిన 27 ఏళ్ల యువకుడిని దిలీప్ గా మలైంకీజు పోలీసులు గుర్తించారు. అతడిని బుధవారం అరెస్టు చేశారు. 

భార్యాభర్తలిద్దరూ సంపాదిస్తే సంసారం బాగుంటుంది. కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకుంటుంది. పిల్లలకు మంచి విద్య, భోజనం, చక్కటి జీవితాన్ని అందించొచ్చు. ఇది నేటి తరం ఎక్కువగా ఆలోచిస్తున్న అంశాలు. అంతేకాదు భార్యా భర్తలిద్దరూ ఉద్యోగాలు చేయడానికి వీలుగా.. భర్తలు కూడా ఇంటిపనిలో భాగం తీసుకుంటున్నారు. తద్వార అప్పుల పాలు కాకుండా కాస్త సౌకర్యవంతమైన జీవితం జీవించొచ్చు. 

దీపావళి రోజున నగరంలోని ఆ మూడు చోట్ల బాంబు పేలుళ్లు.. బెదిరింపు ఫోన్ కాల్ తో అలర్ట్ అయిన ముంబయి పోలీసులు

ఇక అమ్మాయిలు కూడా బాగా చదువుకుంటున్నారు కాబట్టి.. చదువు వృధా కాకుండా ఉంటుందని ఉద్యోగాలకు వెళ్లడం మామూలే. అందుకే ప్రతీచోటా అమ్మాయిలు, మహిళలు కనిపిస్తారు. కానీ ఈ వ్యక్తి మాత్రం భార్య ఉద్యోగం చేయడం ఇష్టం లేదని ఆమెను చిత్ర హింసలకు గురి చేశాడు. 

తిరువనంతపురం స్థానికుడైన దిలీప్ భార్య తన మాట వినకుండా సూపర్ మార్కెట్‌లో పనికి వెడుతుందని ఆమెను కొట్టాడు. వీడియోలో దిలీప్ తన భార్యను దారుణంగా కొడుతున్న సమయంలో  ‘అప్పు తీర్చాలంటే ఉద్యోగానికి వెళ్లాలి' అని దిలీప్ భార్య చెప్పడం వీడియోలో వినపడుతోంది. ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేసిన వీడియోలో మహిళ ముఖం రక్తసిక్తమైంది. దిలీప్ భార్య ఫిర్యాదు మేరకు మలయంకీజు పోలీసులు నిందితుడిని హత్యాయత్నం, అనేక ఇతర అభియోగాల కింద అరెస్టు చేశారు.

అంతకుముందు, జూన్‌లో, మధ్యప్రదేశ్‌లోని దేవాస్ జిల్లాలో ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. ఒక మహిళకు వేరొక వ్యక్తితో సంబంధముందని ఆరోపించినందుకు... బూట్ల దండను ధరించి తన భర్తను బలవంతంగా భుజాలపై మోసుకెళ్లింది. దేవాస్ జిల్లాలోని బోర్‌పదవ్ గ్రామంలో ఈ ఘటన జరిగినట్లు ఏఎన్‌ఐ తెలిపింది. ఈ ఘటనలో 11 మంది, మరికొందరు గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేయబడింది.

click me!