ఎలాంటి ఇగో లేదు.. బీజేపీని జీరో‌ చేయాలన్న మమతా బెనర్జీ.. ఫలిస్తున్న నితీశ్ ప్రయత్నాలు!!

By Sumanth KanukulaFirst Published Apr 24, 2023, 6:46 PM IST
Highlights

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాల ఐక్యత కోసం బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీశ్ కుమార్ ప్రయత్నాలు చేస్తున్న సంగతి  తెలిసిందే. ఈ క్రమంలోనే టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీతో నితీశ్ కుమార్ భేటీ అయ్యారు. 

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాల ఐక్యత కోసం బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీశ్ కుమార్ ప్రయత్నాలు చేస్తున్న సంగతి  తెలిసిందే. ఈ ప్రయత్నాల్లో భాగంగా నితీష్ కుమార్‌ ఈరోజు టీఎంసీ అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ‌తో కోల్‌కత్తాలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆర్జేడీ నాయకుడు, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్‌ కూడా పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ వ్యతిరేక పార్టీల మహా కూటమికి సంబంధించి ‘‘ఇగో క్లాష్’’ లేదని మమతా బెనర్జీ చెప్పారు. 

వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలు ప్రజలు వర్సెస్ బీజేపీగా మారనున్నాయని మమతా బెనర్జీ అన్నారు. సార్వత్రిక ఎన్నికల సమరానికి ఒకే విధమైన ఆలోచనలు ఉన్న ప్రతిపక్షాలన్నీ కలిసి ముందుకెళ్లడానికి తనకు అభ్యంతరం లేదని, తాను ఇంతకుముందు కూడా ఇదే చెప్పానని ఆమె పేర్కొన్నారు.

Latest Videos

‘‘నేను నితీష్ కుమార్‌కి ఒకే ఒక అభ్యర్థన చేసాను. జయప్రకాష్ (నారాయణ) జీ ఉద్యమం బీహార్ నుండి ప్రారంభమైంది. మనం బీహార్‌లో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తే మనం తర్వాత ఎక్కడికి వెళ్లాలో నిర్ణయించుకోవచ్చు. అయితే ముందుగా మునం ఐక్యంగా ఉన్నామనే సందేశం మనం ఇవ్వాలి. నాకు ఎలాంటి అభ్యంతరం లేదని నేను ముందే చెప్పాను. బీజేపీని జీరోకి తీసుకురావాలని నేను ఎప్పుడూ పునరుద్ఘాటిస్తున్నాను.

మీడియా సహాయంతో, నకిలీ కథనాలతో వారు పెద్ద హీరోలుగా మారారు. ఆ వ్యక్తులు అబద్ధాలు మాత్రమే చెబుతారు. వారు ఫేక్ వీడియోలు చేసి గూండాయిజం చేస్తారు. ఇది జరగదు. అందుకే నితీష్ కుమార్ అందరితో మాట్లాడతారు. నేను కూడా మాట్లాడుతున్నాను. మేము కలిసి చేస్తాము. ఇందులో వ్యక్తిగత అహం అనే ప్రశ్నే లేదు’’ అని మమతా బెనర్జీ పేర్కొన్నారు. 

నితీష్ కుమార్ పార్టీ ప్రవేశపెట్టిన ప్రతిపాదిత ఒక సీటు-ఒక అభ్యర్థి ఫార్ములాపై మమతా బెనర్జీ స్పందిస్తూ.. ‘‘ఆలోచన, దృక్పథం, లక్ష్యం స్పష్టంగా ఉంటే, ఎటువంటి సమస్యలు ఉండవు’’ అని అన్నారు. ఇక, ఇది చాలా సానుకూల చర్చ అని నితీశ్ కుమార్ పేర్కొన్నారు. రాబోయే ఎన్నికలకు ముందు అన్ని సన్నాహాలు చేయడం గురించి చర్చించినట్లు చెప్పారు. ఇప్పుడు పాలిస్తున్న వారికి చేసేదేమీ లేదని.. కేవలం సొంతంగా ప్రచారం చేసుకుంటున్నారని.. దేశాభివృద్ధికి ఏమీ చేయడం లేదని విమర్శించారు.

ఇక, ఇటీవల లోక్‌సభ ఎంపీగా రాహుల్ గాంధీ అనర్హత వేటు వేయడంతో ప్రతిపక్ష పార్టీల మధ్య అరుదైన ఐక్యత చోటు చేసుకుంది. ఆ తర్వాత కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, నితీష్ కుమార్, తేజస్వి యాదవ్‌ల భేటీతో బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఏకమయ్యే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. అలాగే నితీష్ కుమార్ కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శకులలో ఒకరైన ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌తో కూడా సమావేశమయ్యారు.  ఈ క్రమంలోనే కేజ్రీవాల్.. మొత్తం ప్రతిపక్షాలు, దేశం ఏకతాటిపైకి వచ్చి కేంద్రంలో ప్రభుత్వాన్ని మార్చడం చాలా అవసరం.అని అంగీకరించారు.
 

click me!