లలిత్ మోదీకి భారీ ఊరట.. క్షమాపణను అంగీకరించిన సుప్రీం కోర్టు..

By Sumanth KanukulaFirst Published Apr 24, 2023, 4:50 PM IST
Highlights

ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీకి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. సోషల్ మీడియా పోస్టులలో న్యాయవ్యవస్థపై చేసిన వ్యాఖ్యలకు లలిత్ మోదీ బేషరతుగా క్షమాపణలు చెప్పడంతో ఆయనపై కోర్టు ధిక్కార విచారణను సుప్రీం కోర్టు సోమవారం ముగించింది. 

న్యూఢిల్లీ: ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీకి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. సోషల్ మీడియా పోస్టులలో న్యాయవ్యవస్థపై చేసిన వ్యాఖ్యలకు లలిత్ మోదీ బేషరతుగా క్షమాపణలు చెప్పడంతో ఆయనపై కోర్టు ధిక్కార విచారణను సుప్రీం కోర్టు సోమవారం ముగించింది. లలిత్ మోదీ దాఖలు చేసిన అఫిడవిట్‌ను సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సీటీ రవికుమార్‌‌లతో కూడిన ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. అందులో న్యాయస్థానాలు, భారత న్యాయవ్యవస్థ ఘనత లేదా గౌరవానికి విరుద్దంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయనని అందులో లలిత్ మోదీ పేర్కొన్నారు. 

‘‘మేము బేషరతుగా క్షమాపణలను అంగీకరిస్తున్నాము. ప్రతివాది (లలిత్ మోదీ) భవిష్యత్తులో న్యాయవ్యవస్థను అగౌరవపర్చేలా మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే  చాలా తీవ్రంగా పరిగణిస్తామని మేము గుర్తు చేస్తున్నాము’’ అని ధర్మాసనం పేర్కొంది. ‘‘మేము బేషరతుగా క్షమాపణలను విశాల హృదయంతో అంగీకరిస్తాం. ఎందుకంటే క్షమాపణ బేషరతుగా, మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పినప్పుడు కోర్టు ఎల్లప్పుడూ క్షమాపణను విశ్వసిస్తుంది. ప్రతి ఒక్కరూ న్యాయవ్యవస్థను గౌరవించాలి, అదే మా తాపత్రయం’’ అని ధర్మాసనం తెలిపింది. 

Latest Videos

ఇక, ఏప్రిల్ 13న న్యాయవ్యవస్థపై లలిత్ మోదీ చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు, జాతీయ వార్తాపత్రికలలో బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఆదేశించింది. లలిత్ మోదీ చట్టానికి, న్యాయవ్యవస్థకు అతీతుడు కాదని.. అలాంటి ప్రవర్తన పునరావృతమైతే చాలా తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించింది. క్షమాపణలు చెప్పే ముందు అఫిడవిట్ దాఖలు చేయాలని తెలిపింది. భవిష్యత్తులో అలాంటి పోస్ట్‌లు చేయబోమని పేర్కొంటూ అఫిడవిట్ దాఖలు చేయాలని కూడా సుప్రీం కోర్టు ఆదేశించింది.

click me!