ఎట్టకేలకు నందిగ్రామ్ లో బిజెపి అభ్యర్థి సువేందు అధికారిపై ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత మమతా బెనర్జీ ఓటమి పాలైనట్లు తెలిపారు. దీనిపై తాను కోర్టుకు వెళ్తానని మమతా బెనర్జీ చెప్పారు.
కోల్ కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన పార్టీ తృణమూల్ కాంగ్రెసుకు తిరుగులేని విజయం సాధించి పెట్టారు. అయితే, తాను పోటీ చేసిన నందిగ్రామ్ లో సమీప బిజెపి ప్రత్యర్థి సువేందు అధికారిపై ఓటమి పాలయ్యారు. నందిగ్రామ్ ఓటమిని తాను అంగీకరిస్తున్నానని, దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మమతా బెనర్జీ అన్నారు
నందిగ్రామ్ లో అవకతవకలు జరిగాయని, దానిపై కోర్టుకు వెళ్తానని మమతా బెనర్జీ చెప్పారు. ఓట్ల లెక్కింపు జరుగుతున్న సమయంలో రౌండ్ రౌండ్ కు ఓట్ల ఆధిక్యాలు దోబుచూలాడుతూ వచ్చాయి. మమతా బెనర్జీ 1200 ఓట్ల తేడాతో సువేందుపై విజయం సాధించినట్లు తొలుత ప్రకటించారు. ఆ తర్వత సువేందు అధికారి 1736 ఓట్ల తేడాతో మమతపై విజయం సాధించినట్లు తేల్చారు.
undefined
తనకు అత్యంత సన్నిహితుడుగా ఉంటూ వచ్చిన సువేందు అధికారి బిజెపిలో చేరి నందిగ్రామ్ నుంచి పోటీ చేయడానికి సిద్ధపడ్డారు. ఆయనపై పోటీ చేసేందుకు మమతా బెనర్జీ సిద్ధపడ్డారు. సువేందును ధీటుగా ఎదుర్కున్నారు. ఏళ్ల తరబడిగా సువేందు అధికారి నందిగ్రామ్ కు ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. దాంతో మమతా బెనర్జీ స్థానికేతరురాలంటూ ప్రచారం సాగించారు
నందిగ్రామ్ లో ప్రచారం చేస్తుండగా మమతాపై దాడి జరిగింది. ఈ దాడిలో ఆమె కాలికి గాయమైంది. నందిగ్రామ్ లో పోటీ చేసేందుకు ఆమె తనకు పెట్టని కోట అయిన బౌనీపురి నియోజకవర్గాన్ని వదులుకున్నారు. నందిగ్రామ్ నుంచి తనను గెలిపిస్తే ఎప్పటికీ ఇక్కడి నుంచే పోటీ చేస్తానని ఆమె చెప్పారు.
ఇదిలావుంటే, నందిగ్రామ్ లో రీకౌంటింగ్ చేయాలనే డిమాండుకు ఎన్నికల సంఘం (ఈసీ) అంగీకరించలేదు. వీవీప్యాట్ లను లెక్కంచిన తర్వాత ఫలితాన్ని ప్రకటిస్తామని చెప్పారు. చివరకు సువేందు అధికారి 1736 ఓట్ల తేడాతో మమతాపై విజయం సాధించినట్లు చెప్పింది.