
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్ర క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో జరుగుతున్న దీదీ గవర్నర్ జగదీప్ ధన్కర్‌కు మధ్య గొడవ పతాకస్థాయికి చేరింది. ఈ వాగ్వాదల నేపథ్యంలో దీదీ సర్కారు బెంగాల్ గవర్నర్ అధికారాలకు కత్తెర వేశారు. యూనివర్సిటీల చాన్సలర్‌గా గవర్నర్ అధికారాలను తుంచేసి.. ఆ హోదాను ముఖ్యమంత్రికి కట్టబెట్టే ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలకు చాన్సలర్‌గా ముఖ్యమంత్రి దీదీని చేస్తూ తెచ్చిన ప్రతిపాదనకు మమతా బెనర్జీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అంతేకాదు, ప్రైవేటు యూనివర్సిటీల విజిటర్‌గానూ గవర్నర్‌ను తొలగించే ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సాధారణంగా ప్రైవేటు యూనివర్సిటీ విజిటర్.. ఆ యూనివర్సిటీకి సంబంధించిన అన్ని రకాల వివరాలు, డాక్యుమెంట్లు డిమాండ్ చేసి పరిశీలించే అవకాశం ఉంటుంది. ఈ విజిటర్‌గా గవర్నర్ స్థానంలో విద్యా శాఖ మంత్రిని చేర్చాలన్న ప్రతిపాదననూ క్యాబినెట్ ఆమోదించింది.
ఈ బిల్లు చట్టంగా మారితే.. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలకు చాన్సలర్‌గా గవర్నర్ కాకుండా ముఖ్యమంత్రి ఉంటారు. అంటే.. వర్సిటీలకు చాన్సలర్‌గా జగదీప్ ధన్కర్ కాకుండా సీఎం మమతా బెనర్జీ ఉండనున్నారు. ఈ బిల్లును రానున్న వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లు చట్టంగా మారడానికి శాసన సభ ఆమోదం పొందాల్సి ఉంటుంది.
రాష్ట్రంలో యూనివర్సిటీలకు వీసీల నియామకమై మమతా బెనర్జీ ప్రభుత్వానికి, రాష్ట్ర గవర్నర్‌కు మధ్య వాదోపవాదాలు జరిగాయి. తన సమ్మతి లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం 24 యూనివర్సిటీలకు వీసీలను నియమించిందని గవర్నర్ జగదీప్ ధన్కర్ ఆరోపించారు. గవర్నర్ ఆరోపణలతో ఈ విభేదాలు పరాకాష్టకు చేరినట్టు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలోనే మమతా బెనర్జీ క్యాబినెట్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.