
ఢిల్లీ విమానాశ్రయంలో రెప్పపాటులో పెను ప్రమాదం తప్పింది. ఒకేసారి రెండు విస్తారా విమానాల ల్యాండింగ్‌కు, టేకాఫ్‌కు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ క్లియరెన్స్ ఇవ్వడంతో ఈ పరిస్థితి ఎదురైంది. వివరాల్లోకి వెళితే.. న్యూఢిల్లీ నుంచి బాగ్డోగ్రాకు వెళ్లాల్సిన UK725 నెంబర్ విమానం ఇటీవల నూతనంగా ప్రారంభించిన రన్ వే పై టేకాఫ్ ప్రక్రియలో వుండగా.. ఇదే సమయంలో అహ్మదాబాద్ నుంచి ఢిల్లీకి వస్తున్న మరో విస్తారా విమానం అదే రన్ వేపై ల్యాండ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది.
అయితే వెంటనే తప్పును గమనించిన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టేకాఫ్‌ను నిలిపివేసింది. ఈ ఘటనపై ఓ విమానాశ్రయ అధికారి మాట్లాడుతూ.. రెండింటికి ఒకేసారి అనుమతి ఇవ్వడం జరిగిందన్నారు. అయితే వెంటనే అప్రమత్తమైన ఏటీసీ అధికారులు టేకాఫ్ అవుతున్న విస్తారా విమానాన్ని తక్షణం నిలిపివేశారని చెప్పారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.