
ఓ ప్రైమరీ స్కూల్ టీచర్ కి మిలియన్ డాలర్ల బహుమతి దక్కింది. ఆయన చేసిన గొప్ప పనికిగాను.. అత్యుత్తమ పురస్కారం దక్కింది. ఈ సంఘటన మహారాష్ట్రలోచోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలోని పరితేవాడి గ్రామానికి చెందిన ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు రంజిత్ సిన్హ డిసేల్(32) భారత్ లోని క్యూఆర్ కోడెడ్ పాఠ్యపుస్తకాల ఆవిష్కరణ విప్లవానికి పునాది వేయడంతోపాటు.. బాలిక విద్య కోసం కృషి చేశారు. ఈ నేపథ్యంలో ఆయనకు గ్లోబల్ టీచర్ ప్రైజ్ 2020 విజేతగా నిలిచారు.
ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఈ పోటీల్లో ఆయన విజేతగా నిలవడం గమనార్హం. మొత్తం 10 ఫైనలిస్ట్ లో ఆయన విజేతగా నిలిచారు. ప్రైజ్ మనీగా ఆయనకు మిలియన్ డాలర్లు ప్రకటించగా.. దానిలో సగం ఆయన మిగిలిన ఫైనలిస్ట్ లకు పంచుతానని చెప్పడం విశేషం. బహుమతిలో సగం డబ్బులు ఆయన తీసుకోగా.. మిగిలిన సగం 9మంది ఫైనలిస్ట్ లకు పంచిపెట్టనున్నారు. ఆయన తీసుకున్న ఈ నిర్ణయం కూడా అందరిచేతా ప్రశంసలు అందుకుంటున్నారు.
బహుమతి డబ్బును పంచుకున్న మొదటి విజేతగా చరిత్ర సృష్టించారని ప్రముఖ దాత, ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సన్నీ వర్కీ అన్నారు. తద్వారా పంచుకోవడం, ఇవ్వడంలోని ప్రాముఖ్యతను ప్రపంచానికి బోధించారని ప్రశంసించారు. రంజిత్‌లాంటి ఉపాధ్యాయులు క్లైమేట్ చేంజ్‌ను నిలువరించడంతో పాటు, శాంతియుతమైన, ధర్మబద్ధమైన సమాజాలను నిర్మిస్తారని, అసమానతలను తొలగించి ఆర్థికవృద్ధితో ముందుకు నడిపిస్తారని యునెస్కో (ఐక్యరాజ్యసమితి విద్యా, శాస్త్రీయ, సాంస్కృతిక సంస్థ) సహాయ డైరెక్టర్ జనరల్ స్టెఫానియా జియాన్నిని కొనియాడారు. తద్వారా మన భవిష్యత్తును కాపాడుతారని పేర్కొన్నారు. మరోవైపు కరోనా మహమ్మారి విద్యను, విద్యార్థులను బాగా ప్రభావితం చేసింది. కానీ ఈ కష్ట సమయంలో ప్రతి విద్యార్థి వారి జన్మహక్కు అయిన నాణ్యమైన విద్యను పొందేలా తమ వంతు కృషి చేస్తున్నారని డిసేల్ అన్నారు.