Maharashtra political crisis: మహా సంక్షోభం.. ఫ్లోర్ టెస్ట్‌కు సిద్ధమే.. : ఏక్‌నాథ్ షిండే

By Mahesh RajamoniFirst Published Jun 29, 2022, 2:28 PM IST
Highlights

Eknath Shinde: మెజారిటీ నిరూపించుకోవడానికి గ‌వ‌ర్న‌ర్ జారీ చేసిన‌ బలపరీక్ష ఉత్త‌ర్వుల‌ను సీఎం ఉద్ధ‌వ్ థాక్రే నేతృత్వంలోని  శివ‌సేన సుప్రీంకోర్టులో సవాలు చేసింది. బుధవారం సాయంత్రం 5 గంటలకు ఈ పిటిష‌న్ విచారణకు రానుంది.
 

Maharashtra political crisis: మ‌హారాష్ట్ర రాష్ట్ర రాజ‌కీయాలు ప్ర‌స్తుతం కాక‌రేపుతున్నాయి. రెబ‌ల్ నాయ‌కుల దూకుడుతో పాటు రాష్ట్రంలోని  ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీల నాయ‌కుల మ‌ధ్య కొన‌సాగుతున్న మాట‌ల యుద్ధం రాష్ట్ర రాజ‌కీయాల‌ను మ‌రింత‌గా వేడెక్కిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే త‌మ మెజారిటీని నిరూపించుకోవాల‌ని గ‌వ‌ర్న‌ర్ ఉత్త‌ర్వులు జారీ చేశారు. దీనికి వ్య‌తిరేకంగా శివ‌సేన సుప్రీంకోర్టును ఆశ్ర‌యించింది. దీనిపై స్పందించిన రెబల్ ఎమ్మెల్యేల నాయకుడు ఏక్‌నాథ్‌ షిండే తాము బలపరీక్షకు సిద్ధంగా ఉన్నామని బుధవారం నాడు చెప్పారు.  నలుగురు ఎమ్మెల్యేలతో కలిసి ఇక్కడి ప్రసిద్ధ కామాఖ్య ఆలయాన్ని సందర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించారని siasat నివేదించింది. 

ఆలయంలోకి ఏక్‌నాథ్‌ షిండేతో పాటు ఇతర ఎమ్మెల్యేలకు ఆలయ నిర్వాహక కమిటీ స్వాగతం పలికింది. ఎన్‌నాథ్ షిండే తో పాటు ఇతర తిరుగుబాటుదారులైన శివసేన‌ ఎమ్మెల్యేలు వారం రోజులుగా గౌహతిలోని రాడిసన్ బ్లూ హోటల్‌లో బ‌స చేస్తున్న సంగ‌తి తెలిసిందే. వీరు అక్క‌డ ఉండ‌టానికి జూన్ 30 వరకు హోటల్ బుక్ చేయబడిందని నివేదిక‌లు పేర్కొంటున్నాయి. "రేపు ముంబైకి తిరిగి వస్తాను, ఇక్కడ కామాఖ్య ఆలయంలో మహారాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం ప్రార్థించాను" అని ఆలయాన్ని సందర్శించిన తర్వాత షిండే పేర్కొన్నారు. "మహారాష్ట్ర గవర్నర్ సమావేశమయ్యారు. మేము మహారాష్ట్ర అసెంబ్లీలో ఫ్లోర్ టెస్ట్‌లో పాల్గొంటాము మరియు అన్ని ప్రోటోకాల్‌లను అనుసరిస్తాము" అని తెలిపారు. ఆలయ సందర్శన అనంతరం తిరుగుబాటు ఎమ్మెల్యేలందరూ ఉన్న హోటల్‌లో ఏక్‌నాథ్ షిండే శిబిరం సమావేశాన్ని నిర్వహించింది.

ఈ స‌మావేశంలో పాలుపంచుకున్న శివ‌సేన తిరుగుబాటు ఎమ్మెల్యే గులాబ్రావ్ పాటిల్ మాట్లాడుతూ.. "ప్రజలు మాతో ఉన్నారు.. మేము రేపు ఫ్లోర్ టెస్ట్ గెలుస్తాము. మేమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు" అని పేర్క‌న్నారు. ఇదిలావుండ‌గా, ప్ర‌స్తుతం అసోంలో వ‌ర‌ద‌లు పోటేత్తాయి. ఇలాంటి స‌మ‌యంలో అక్క‌డి సీఎం, ఇత‌ర నాయ‌కులు శివ‌సేన రెబ‌ల్ ఎమ్మెల్యేల సేవ‌లో ఉండ‌టంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్ర‌మంలోనే అసోం వ‌ర‌ద‌ల‌పై ఏక్‌నాథ్ షిండే బుధ‌వారం నాడు స్పందించారు. “శివసేన ఎమ్మెల్యేలు మరియు మిత్రపక్ష ఎమ్మెల్యేలంద‌రూ క‌లిసి అసోం వరద బాధిత ప్రజలను ఆదుకోవడానికి అసోం ముఖ్య‌మంత్రి సహాయ నిధికి 51 లక్షల రూపాయలను అందించాలని నిర్ణయం తీసుకున్నారు” అని ట్వీట్ చేశారు. 

కాగా, బుధ‌వారం మధ్యాహ్నం గౌహతి నుంచి శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు గోవాకు వెళ్లే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలందరినీ ఈరోజు గౌహతి నుంచి గోవాకు తీసుకెళ్లేందుకు స్పైస్‌జెట్ విమానం గౌహతికి వెళుతోంది. ఈ విమానం గౌహతిలోని లోక్‌ప్రియ గోపీనాథ్ బోర్డోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి మధ్యాహ్నం 3 గంటలకు గోవాలోని దబోలిమ్ విమానాశ్రయానికి బయలుదేరుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇదిలావుండ‌గా, ముఖ్య‌మంత్రి ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివ‌సేన ఫ్లోర్ టెస్ట్ ఆర్డర్‌ను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసింది. ఈ పిటిష‌న్ బుధ‌వారం సాయంత్రం 5 గంట‌ల‌కు విచార‌ణ‌కు వ‌చ్చే అవ‌కాశ‌ముంద‌ని స‌మాచారం. 
 

click me!