
మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలోని షుగర్ మిల్లులో శనివారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఫ్యాక్టరీలోని బాయిలర్ పేలడం వల్ల భారీ మంటలు చేలారేగాయి. ఈ క్రమంలో నాలుగు ఇథనాల్ ట్యాంకులలో కూడా పేలుళ్లు సంభవించినట్టు సమాచారం.
ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో 150 పైగా కార్మికులు ఉన్నారని తెలుస్తుంది. ఈ ప్రమాదం సాయంత్రం ఏడు గంటలకు జరిగింది. అగ్నిప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక దళానికి చెందిన వాహనాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. పేలుడు కారణంగా మంటలు విస్తృతంగా వ్యాపించాయి. మంటలను ఆర్పేందుకు ప్రయత్నాలు చేశాయి.
మంటలు చెలరేగిన ప్రదేశంలో 70 నుంచి 80 మంది కార్మికులు చిక్కుకుపోయి ఉండటంతో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం అందలేదు. మరోవైపు అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. అహ్మద్‌నగర్, ఔరంగాబాద్, షెవ్‌గావ్‌కు చెందిన ఫైర్‌ఫైటర్స్ మంటలర్పే ప్రయత్నాలు చేస్తున్నారు.
అధికారుల సమాచారం ప్రకారం.. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో 150 మంది కార్మికులు పని చేసేవారు. ఇప్పటివరకూ ఎలాంటి ప్రాణ నష్టం లేదని తెలిపారు. సహయక చర్యలు కొనసాగుతున్నాయని, గాయపడిన కార్మికులను సమీప ఆస్పతికి తరలించి.. చికిత్స అందిస్తున్నామని తెలిపారు.
న్యూస్ ఏజెన్సీ పిటిఐ ప్రకారం.. అగ్నిమాపక సిబ్బంది, పోలీసు సిబ్బంది ఇప్పటివరకు 32 మందిని ఫ్యాక్టరీ నుండి రక్షించారని పోలీసు అధికారి తెలిపారు. స్థానిక మీడియా ప్రకారం..సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.