
కేంద్ర సహాయ మంత్రి నిశిత్ ప్రమాణిక్ కాన్వాయ్‌పై రాళ్ల దాడి జరిగింది. పశ్చిమ బెంగాల్ లోని కూచ్ బెహార్లో తృణమూల్ కాంగ్రెస్ మద్దతు దారులు కేంద్రమంత్రి కాన్వాయ్ పై దాడి చేశారు. ఆయన ప్రయాణిస్తున్న కారు ముందు అద్దం ధ్వంసమైంది. అయితే ఈ దాడిలో ఆయనకు ఎలాంటి ప్రమాదం లేకుండా సురక్షితంగా బయటపడ్డారని స్థానిక పోలీసులు తెలిపారు. ఆయన దిన్హాటా ప్రాంతంలో పార్టీ కార్మికులను కలవడానికి వెళ్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. దాడి అనంతరం నల్ల జెండాలు చూపుతూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సమయంలో బీజేపీ,తృణమూల్ కార్మికుల మధ్య ఘర్షణ తలెత్తింది.
వాస్తవానికి.. కొన్ని రోజుల క్రితం బిఎస్‌ఎఫ్ కాల్పుల్లో స్థానిక గిరిజనుడు చనిపోయాడు. ఈ ఘటన స్థానిక ప్రజలలో ఆగ్రహాన్ని కలిగించింది. ఈ ఘటనను తృణమూల్ కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిసిత్ ప్రమాణిక్ దీనికి కారణమని ఆరోపించింది. కాగా, కేంద్ర మంత్రి నిసిత్ ప్రమాణిక్ శనివారం స్థానిక బీజేపీ కార్యాలయానికి వెళ్తుండగా అతని కాన్వాయ్ పై దిన్హాటాలోని బుడిర్హాట్ ప్రాంతంలో దాడి జరిగింది.స్థానికులు నల్ల జెండాలతో నిరసన తెలిపారు. కేంద్ర మంత్రి నిసిత్ కాన్వాయ్‌పైకి కొందరు రాళ్లు విసిరారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రయాణించిన కారు ముందు అద్దం ధ్వంసమైంది. ఈ దాడితో అప్రమత్తమైన భద్రతబలగాలు వెంటనే అక్కడికి చేరుకుని కేంద్ర మంత్రిని అక్కడి నుండి తరలించారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు.
ఈ దాడిపై కేంద్ర మంత్రి నిషిత్ ప్రమానిక్ మాట్లాడుతూ.. బెంగాల్‌లో అధికారంలో ఉన్న సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వంపై మండిపడ్డారు. బెంగాల్ లో దుర్మార్గపు పాలన రాజ్యమేలుతోందనీ, మంత్రికే రక్షణ లేకపోతే సాధారణ ప్రజల భద్రత గురించి ఊహించుకోవచ్చని విమర్శించారు. ఈ దాడిని బట్టి బెంగాల్‌లో ప్రజాస్వామ్యం ఏ స్థితిలో ఉందో తెలుసుకోవచ్చని, బెంగాల్ లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తెలుసుకోవడానికి ఈ దాడే నిదర్శనమని ఆరోపించారు. కాగా, కేంద్ర మంత్రి కాన్వాయ్‌పై రాళ్ల దాడికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
అంతకుముందు తృణమూల్ ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఫిబ్రవరి 11 న కూచ్ బెహార్‌లో జరిగిన సమావేశానికి వెళ్లారు. బిఎస్‌ఎఫ్ కాల్పుల్లో రాజ్‌బాన్సీ యువత మరణించినందుకు అభిషేక్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్రమంత్రి నిషిత్‌పై విమర్శలు గుప్పించారు. గిరిజనుడి హత్యపై కేంద్ర మంత్రి నిసిత్ ఏమీ చేయడం లేదని మండిపడ్డారు. ఆయనకు వ్యతికేకంగా నిరసనలు చేయాలని పిలుపునిచ్చారు.