
ఇటీవల మహారాష్ట్రలోని సమృద్ధి ఎక్స్‌ప్రెస్ వే పై బస్సులో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 25 మంది ప్రాణాలు కోల్పోయిన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన సంతి తెలిసిందే. అయితే మరోసారి ఇలాంటి ఘటన జరగకూడదంటూ ఓ వ్యక్తి సంఘటనా స్థలంలో ‘మహా మృత్యుంజయ్ యంత్రాన్ని’ ఏర్పాటు చేయడమే కాకుండా, ప్రమాదాల నివారణకు మంత్రాలు పఠించాడు. అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ‘‘అంధశ్రద్ధ నిర్మూలన్ సమితి’’ అనే మూఢ నమ్మకాల నిరోధక సమితికి చెందిన హమీద్ దభోల్కర్ ఈ తంతుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆపై పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు.
మహారాష్ట్రంలోని బుల్దానా జిల్లాలోని సమృద్ధి ఎక్స్‌ప్రెస్ వే పై జూలై 1న ప్రైవేట్ బస్సు మంటల్లో చిక్కుకుకోవడంతో 25 మంది సజీవ దహనమయ్యారు. ఈ క్రమంలో జూలై 23 న బుల్దానాకు చెందిన నీలేష్ అధవ్.. ఎక్స్‌ప్రెస్ వేలోని సింధ్‌ఖేడ్రాజా ప్రాంతంలోని పింపాల్ ఖుటా వద్ద ఎక్కడైతే ప్రమాదం జరిగిందో అక్కడికి చేరుకున్నాడు. అనంతరం కొంతమందితో కలిసి ‘‘మహా మృత్యుంజయ్ యంత్రాన్ని’’ అమర్చి.. మహామృత్యుంజయ్ మంత్రాన్ని పఠించారు. అంతేకాదు.. మహామృత్యుంజయ్ యంత్రం వల్ల ఐదు కిలోమీటర్ల పరిధిలో ఎలాంటి ప్రమాదం జరగదని అధవ్ సోషల్ మీడియాలో పేర్కొన్నాడు.
దీనిపై ఫిర్యాదు అందడంతో ‘‘ మహారాష్ట్ర ప్రివెన్షన్ అండ్ ఎరాడిక్షన్ ఆఫ్ హ్యూమన్ శాక్రిఫైస్ అండ్ అదర్ ఇన్‌హ్యూమన్, ఈవిల్ అండ్ అఘోరి ప్రాక్టీసెస్ అండ్ బ్లాక్ మేజిక్ యాక్ట్ 2013 ’’ కింద అధవ్‌పై కేసు నమోదు చేశారు పోలీసులు. కాగా.. మహారాష్ట్రలోని సమృద్ధి ఎక్స్‌ప్రెస్ వే పై గత ఆరు నెలల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 80 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని గతంలో ఓ అధికారి పేర్కొన్నారు.