సిబిఐ విచారణకు హైకోర్టు ఆదేశం: మహా హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ రాజీనామా

By telugu teamFirst Published Apr 5, 2021, 3:18 PM IST
Highlights

మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆయన సీఎం ఉద్ధవ్ థాకరేకు పంపించారు. సిబిఐ విచారణకు బొంబాయి హైకోర్టు ఆదేశించడంతో ఆయన రాజీనామా చేశారు.

ముంబై: ఎట్టకేలకు మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ రాజీనామా చేశారు. నైతిక బాధ్యత వహిస్తూ ఆయన సోమవారంనాడు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆయన ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేకు పంపించారు. ముంబై పోలీసు మాజీ చీఫ్ పరంబీర్ సింగ్ చేసిన ఆరోపణలపై 15 రోజుల్లోగా ప్రాథమిక విచారణ జరపాలని బొంబాయి హైకోర్టు సీబిఐ ఆదేశించింది.

సీబీఐ ఆదేశాల నేపథ్యంలో అనిల్ దేశ్ ముఖ్ నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేశారు. తాను ఏ విధమైన తప్పు చేయలేదంటూ రాజీనామా చేయాలనే డిమాండును ఆయన చాలా కాలంగా తిరస్కరిస్తూ వచ్చారు. 

అనిల్ దేశ్ ముఖ్ మీద వచ్చిన ఆరోపణలపై సిబిఐ విచారణ జరుపుతున్న నేపథ్యంలో పదవిలో కొనసాగడం మంచిది కాదనే ఉద్దేశంతో రాజీనామా చేసినట్లు ఎన్సీపీ నేత ఒకరు వ్యాఖ్యానించారు. కోర్టు ఆదేశాలపై మాట్లాడేందుకు పరంబీర్ సింగ్ నిరాకరించారు. తాను మాట్లాడేదేమీ లేదని అన్నారు. 

తనను బదిలీ చేసిన తర్వాత పరమ్ బీర్ సింగ్ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేకు సంచలన ఆరోపణలతో లేఖ రాశారు. బార్లు, రెస్టారెంట్ల నుంచి నెలకు రూ.100 కోట్లు వసూలు చేయాలని అనిల్ దేశ్ ముఖ్ తనకు చెప్పినట్లు ఆయన ఆరోపించారు. అప్పటి నుంచి కూడా రాజీనామా చేయాలని అనిల్ దేశ్ ముఖ్ మీద ఒత్తిడి వస్తూనే ఉంది. 

click me!