
రాష్ట్రంలో ఎండలు మండిపోతూ వుండటంతో మహారాష్ట్రలో మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య బహిరంగ ప్రదేశాల్లో ఈవెంట్‌లపై నిషేధం విధించింది ప్రభుత్వం. ఆదివారం నవీ ముంబైలోని ఖర్ఘర్‌లో జరిగిన మహారాష్ట్ర భూషణ్ కార్యక్రమానికి హజరైన 14 మంది హీట్ స్ట్రోక్‌తో మరణించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను జారీ చేస్తుందని కేబినెట్ మంత్రి మంగళ్ ప్రభాత్ లోధా తెలిపారు.
మహారాష్ట్ర ప్రభుత్వం ఆదివారం భూషణ్ అవార్డు ప్రదాన కార్యక్రమం నిర్వహించింది. నవీ ముంబయిలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా హాజరై అవార్డును సోషల్ యాక్టివిస్టు దత్తాత్రేయ నారాయణ్‌కు అందించారు. ఈ సిటీలో ఉష్ణోగ్రత గరిష్టంగా 38 డిగ్రీలుగా నమోదైంది. సీఎం ఏక్‌నాథ్ షిండే, ఆయన డిప్యూటీ దేవేంద్ర ఫడ్నవీస్‌లూ కార్యక్రమంలో ఉన్నారు. వేలాది మంది ఈ అవార్డు కార్యక్రమానికి తరలివచ్చారు. కానీ, వారికి తగిన ఏర్పాట్లు లేవని తెలుస్తున్నది. బయటకు వచ్చిన వీడియోల ప్రకారం, వేలాది మంది ఎలాంటి ఆవాసం లేకుండా ఎండల్లో కూర్చుని ఉండగా.. మధ్య మధ్యలో వారు కార్యక్రమాన్ని వీక్షించడానికి స్క్రీన్లు ఏర్పాటు చేశారు. సుమారు వేయి మంది వీఐపీలు, మీడియావారి కోసం రెండే టెంట్లు వేశారు.
ALso Read: అవార్డు కార్యక్రమంలో విషాదం.. మండే ఎండల్లో 6 గంటలు.. 11 మంది మృతి!.. 600 మందికి వడదెబ్బ
ఎండ కారణంగా డీహైడ్రేషన్‌తో బాధపడ్డారు. మరికొందరు కళ్లు తిరిగి కిందపడిపోయారు. ఇలాంటి ఘటనలతో ఒక తొక్కిసలాంటి పరిస్థితులు అక్కడ ఏర్పడ్డాయి. వేడి సంబంధిత కారణాలతో ఇక్కడ మరణాలు చోటుచేసుకున్నాయి. సుమారు 600 మందికి వడదెబ్బ తగిలింది. ఈ ఘటన పై సీఎం ఏక్‌నాథ్ సిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌లు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీఎం షిండే హాస్పిటల్ వెళ్లి బాధితులను పరామర్శించారు.