పిల్ల‌ల్ని ఎత్తుకుపోయేవార‌నే అనుమానంతో న‌లుగురు సాధువుల‌పై దాడి..

By Mahesh RajamoniFirst Published Sep 14, 2022, 10:25 AM IST
Highlights

Maharashtra: పిల్లలను ఎత్తుకుపోతున్నారనే అనుమానంతో నలుగురు సాధువులపై దాడి జ‌రిగింది. అంద‌రూ చూస్తుండ‌గానే ఒక కిరాణా దుకాణం ముందున్న సాధువుల‌ను ప‌లువురు క‌ర్ర‌ల‌తో దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైర‌ల్ గా మారింది.
 

Sadhus Assaulted In Maharashtra:  చిన్న‌పిల్ల‌ల‌ను ఎత్తుకుపోతున్నార‌నే అనుమానంతో సాధువుల‌పై దాడి జ‌రిగింది. న‌లుగురు సాధువులు ఒక కిరాణా దుకాణం ముందున్న స‌మ‌యంలో కొంత మంది వ్య‌క్తులు వారిపై దాడి చేశారు. క‌ర్ర‌ల‌తో వారిని తీవ్రంగా కొట్టారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైర‌ల్ గా మారాయి. ఈ ఘ‌ట‌న మ‌హారాష్ట్రలో చోటుచేసుకుంది. 

వివ‌రాల్లోకెళ్తే.. మంగళవారం నాడు మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో నలుగురు సాధువులపై పిల్లలను ఎత్తుకుపోతున్నారనే అనుమానంతో ఒక గుంపు దాడికి పాల్పడిన వీడియో వైరల్‌గా మారింది. జిల్లాలోని లవణ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అంద‌రూ చూస్తుండ‌గానే.. క‌ర్ర‌ల‌తో ప‌లువురు వ్య‌క్తులు వారికి దాడికి పాల్ప‌డ్డారు. కిరాణా దుకాణం వెలుప‌ల ఈ ఘ‌ట‌న జ‌రిగింది. అయితే ఈ విషయమై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

"న‌లుగురు సాధువుల‌ను కొడుతున్న ఘ‌ట‌న‌కు సంబంధించి మాకు ఎటువంటి ఫిర్యాదు లేదా అధికారిక నివేదిక రాలేదు. అయితే, సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతున్న‌ వీడియోలను పరిశీలిస్తున్నాము. ఇంకా వాస్తవాలను ధృవీకరిస్తున్నాము. అవసరమైన చర్యలు తీసుకుంటాము" అని సాంగ్లీ ఎస్పీ దీక్షిత్ గెడమ్ చెప్పిన‌ట్టు వార్తా సంస్థ ఏఎన్ఐ నివేదించింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన నలుగురు సాధువులు కర్ణాటకలోని బీజాపూర్ నుండి ఆలయ పట్టణం పంఢర్‌పూర్‌కు వెళుతుండగా ఒక బాలుడిని దారి అడిగారు..  ఇది పిల్లలను కిడ్నాప్ చేసే ముఠాకు చెందినదని స్థానికులు అనుమానించడానికి దారితీసిందని పోలీసులు పేర్కొన్న‌ట్టు వార్తా సంస్థ పీటీఐ నివేదించింది. .

 

ji This is how they continue beat up sadhus in Maharashtra.Killing a elephant or beating up Sadhus will bring unbearable natural disasters to Maharashtra.Hell is waiting to come down on Maharashtra. you suffered for taking over Shani temple, now this. pic.twitter.com/migfnIm5Rs

— Kanimozhi (@kanimozhi)

బాధితులు లవణ గ్రామంలోని ఒక దేవాలయం వద్ద ఆగిపోయారు. వారు తమ ప్రయాణాన్ని తిరిగి ప్రారంభిస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగిందని నివేదిక పేర్కొంది. వారు బాలుడిని వారు వెళ్ల‌ద‌ల‌చుకున్న ప్ర‌యాణ మార్గం వివ‌రాలు అడిగిన త‌ర్వాత‌.. అక్క‌డున్న ప‌లువురు వారు పిల్ల‌ల్ని ఎత్తుకుపోయే వారిగా అనుమానం వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలోనే వారితో వాగ్వాదానికి దిగారు.. ఆ త‌ర్వాత జ‌రిగిన ప‌రిస్థితులు దాడికి దారితీశాయి.  సాధువులు ఉత్తరప్రదేశ్‌లోని ' అఖాడా'లో సభ్యులుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్ ఈ ఘటనను ఖండిస్తూ.. సాధువులతో ఇలాంటి అనుచిత ప్రవర్తనను రాష్ట్ర ప్రభుత్వం సహించదని అన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. "పాల్ఘర్‌లో సాధువుల హత్య కేసులో అప్పటి ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం వారికి అన్యాయం చేసింది. కానీ ప్రస్తుత మహారాష్ట్ర ప్రభుత్వం ఏ సాధువుపై ఎలాంటి అన్యాయాన్ని అనుమతించదు" అని 2020 సంఘటనను ప్రస్తావిస్తూ ఆయన అన్నారు.

click me!