
మహారాష్ట్ర అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే మెజారిటీని నిరూపించుకున్నారు. ఆయనకు శివసేన రెబల్ ఎమ్మెల్యేలతో పాటు, బీజేపీ ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. దీంతో అసెంబ్లీలో మెజారిటీ మార్క్ 144 మించి ఏక్‌నాథ్ షిండ్‌కు మద్దతు లభించింది. ఇందుకు సంబంధించిన పూర్తి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది.
ఇక, ఏక్ నాథ్ షిండే వర్గం శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే ను ఎంవీఏ నుంచి వైదొలిగి బీజేపీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరింది. దీనికి సీఎం ఠాక్రే ఒప్పుకోలేదు. దీంతో ఎంవీఏ ప్రభుత్వాన్ని సభలో బలం నిరూపించుకోవాల్సిందిగా ఆదేశించాలని గవర్నర్ ను మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ కోరారు. దీంతో సభలో మెజారిటీని చూపించాలని గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. కానీ దీనిని ఎదుర్కోవడం ఇష్టం లేని ఉద్దవ్ ఠాక్రే తన పదవి నుంచి వైదొలిగారు. దీంతో ఈ నెల 30వ తేదీన సీఎంగా ఏక్ నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.
ఈ నేపథ్యంలో ఆదివారం ప్రత్యేకంగా నిర్వహించిన శాసన సభ సమావేశాల్లో స్పీకర్ ఎన్నిక జరిగింది. కొత్త స్పీకర్ గా బీజేపీ కి చెందిన ఎమ్మెల్యే రాహుల్ నార్వేకర్ ఎన్నికయ్యారు. ఎంవీఏ తరుఫున పోటీ చేసిన ఎమ్మెల్యే రాజన్ సాల్వీ ఓడిపోయారు. షిండే తిరుగుబాటు చేసినప్పుడు తన వద్ద 50 మందికి పైగా ఎమ్మెల్యేలు ఉన్నారని పేర్కొన్నారు. అయితే ఆదివారం జరిగిన స్పీకర్ ఎన్నికల్లో రాహుల్ నార్వేకర్‌కు అనుకూలంగా 164 ఓట్లు వచ్చాయి. దీంతో ఆయన మొదటి నుంచి చెప్పిన సంఖ్య సరైనదిగానే కనిపిస్తోంది.