
పూణె: ఆడపిల్ల పుట్టిందంటే ఇప్పటికీ చాలా కుటుంబాలు అదిరిపడతాయి. వంశోద్ధారకుడే కావాలని ఆరాటపడుతుంటాయి. కానీ, కొన్ని కుటుంబాలు ఇప్పుడిప్పుడే ఆ జాఢ్యం నుంచి బయటపడుతున్నాయి. లింగ సమానత్వాన్ని కోరుకునే వారు ఈ మార్పును స్వాగతిస్తున్నారు. అయితే, ఈ జాఢ్యాన్ని పటాపంచలు చేస్తూ మహారాష్ట్రకు చెందిన ఓ రైతు సంచలనం సృష్టించాడు. తనకు మనవరాలు పుట్టిందని కుంగిపోవడం కాదు కదా... ఆమెను తన ఇంటికి ఎంత ఘనంగా తీసుకురావాల? అని ఆలోచనలో పడ్డాడు. తన మనవరాలిని ఇంటికి తీసుకురావడానికి ఆమెపై మమకారాన్ని వ్యక్తం చేస్తూ ఏకంగా హెలికాప్టర్‌నే బుక్ చేశాడు.
తన కుమారుడికి కూతురు పుట్టిందని తెలియగానే ఆ తాత తబ్బుబ్బి పోయాడు. ఆమెపై అనంత ప్రేమను చాటుకోవాలని తాపత్రయపడ్డాడు. అందులో భాగంగానే తన ఇంటికి తొలిసారిగా వస్తున్న తన మనవరాలికి గ్రాండ్ వెల్‌కమ్ చెప్పాలని ఫిక్స్ అయ్యాడు. అందుకే హెలికాప్టర్‌ను పంపి తన మనవరాలిని తొలిసారిగా తన ఇంటికి తీసుకువచ్చాడు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. పూణె జిల్లా బాలెవాడి ఏరియాకు చెందిన రైతు అజిత్ పాండురంగ్ బల్వాద్కర్ ఈ నిర్ణయం తీసుకుని సంచలనానికి తెరలేపాడు.
తన కోడలు కూతురికి జన్మ ఇచ్చిన తర్వాత ఆమె హాస్పిటల్ నుంచి తల్లిగారింటికి వెళ్లింది. కోడలు తల్లిగారి ఊరు ఆ రైతు గ్రామానికి సమీపంలోనే ఉండే షేవాల్ వాడి. కోడలుతోపాటే తన మనవరాలు కూడా అక్కడే ఉంది. రెస్ట్ పీరియడ్ ముగిసిన నేపథ్యంలో ఆమెను, తన మనవరాలిని స్వగ్రామానిక తీసుకురావల్సి ఉన్నది. ఈ నేపథ్యంలో తొలిసారి తన ఇంటికి వస్తున్న మనవరాలిని గ్రాండ్‌గా రిసీవ్ చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే అజిత్ పాండురంగ్ బల్వాద్కర్ ఏకంగా హెలికాప్టర్‌నే పంపాడు. తన మనవరాలు హెలికాప్టర్‌లో రావడాన్ని చూసి మురిసిపోయాడు.
ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో జనవరిలో అరుదైన ఘటన జరిగింది. తన కూతురు ఉన్నత స్థాయికి ఎదగడమే కాకుండా.. తనకు బాస్ గా మారింది. డీఎస్పీ స్థాయిలో ఉన్న కూతురిని.. సీఐగా ఉన్న తండ్రి అందరి ముందూ సెల్యూట్ చేయడం.. అందరినీ ఆకట్టుకుంది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ లోనే చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ఏపీ పోలీస్ శాఖ మొట్టమొదటి సారిగా ‘పోలీస్ డ్యూటీ మీట్ 2021’ను ప్రతిష్టాత్మకంగా తిరుపతిలో నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా తిరుపతిలో డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తన కంటే పెద్ద స్థాయిలో ఉన్న కూతురికి తండ్రి సెల్యూట్ చేస్తున్న అరుదైన దృశ్యం అందరినీ ఆకట్టుకుంది.
2018 బ్యాచ్‌కి చెందిన జెస్సీ ప్రశాంతి.. గుంటూరు అర్బన్ సౌత్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)గా బాధ్యతలు తీసుకున్నారు. ప్రస్తుతం తిరుపతిలో జరుగుతున్న పోలీస్ డ్యూటీ మీట్‌లో భాగంగా ‘దిశ’ విభాగంలో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి తిరుపతి కళ్యాణి డ్యామ్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ)గా విధులు నిర్వహిస్తున్న ప్రశాంతి తండ్రి శ్యామ్ సుందర్ కూడా వచ్చారు. పోలీస్ డ్యూటీ మీట్‌లో తన కంటే పెద్ద స్థాయిలో విధుల్లో ఉన్న తన కూతురిని చూస్తూ శ్యామ్ సుందర్ మురిసిపోయారు.