Tomatoes: టమాటలు అమ్మి నెల రోజుల్లో కోటీశ్వరుడైన రైతు.. ఎక్కడంటే?

By Mahesh K  |  First Published Jul 15, 2023, 1:13 PM IST

మహారాష్ట్రకు చెందిన ఓ రైతు కుటుంబం టమాటలు సాగు చేసి విక్రయించి నెల రోజుల్లోనే కోటిన్నర రూపాయలు సంపాదించింది. ఒక్క టమాట పెట్టెను రూ. 1000 నుంచి రూ. 2,400 వరకు ఆ కుటుంబం విక్రయించింది.
 


పూణె: రైతుల కష్టాల గురించే మనం ఎక్కువ వార్తలు చూస్తుంటాం. పెట్టిన పెట్టబడులు రాక, అప్పులపాలై, రుణ సహాయం అందక, ఇంకా అనేక సమస్యలతో అన్నదాత చితికిపోవడం నిత్యం చూస్తూనే ఉంటాం. కానీ, తొలిసారి మహారాష్ట్రకు చెందిన ఓ రైతు గురించి పాజిటివ్ న్యూస్ వచ్చింది. టమాట ధరలు అమాంతం పెరగడంతో కొందరు రైతులు మంచిగా సంపాదించుకున్నారు. ఇలాంటి ఘటనలు అరుదైనా.. ఆసక్తి కలిగించేవే. 

మహారాష్ట్ర పూణె జిల్లాలో టమాట సాగు చేసిన రైతులు జాక్ పాట్ కొట్టేశారు. పంట చేతికి రాగానే మార్కెట్‌లో ధరలు వారికి అనుకూలంగా మారడంతో చాలా మంది లక్షాధికారులయ్యారు. కొందరు కోటీశ్వరులూ అయ్యారు. పూణెలోని తుకారాం భాగోజీ గయాకర్ నెల రోజుల్లోనే కోటిన్నర సంపాదించాడు.

Latest Videos

తుకారాంకు 18 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది. కానీ, సమస్యలు, ఇతర పరిస్థితులను ఆలోచించి 12 ఎకరాల్లోనే టమాట సాగు చేశాడు. తన కొడుకు ఈశ్వర్ గయాకర్, కోడలు సోనాలి సహకారం తీసుకున్నారు. కొడుకు, కోడలు చదువుకున్నవారు కావడంతో పంట గురించి, దానికి తెగుళ్లు వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు కచ్చితంగా తీసుకున్నారు. సమస్యను గుర్తించి అందుకు తగిన ఎరువులు, పురుగుల మందులు వాడారు. దీంతో పంట దిగుబడి పెరిగింది.

టమాటలను తెంపి నారాయణ్ గంజ్‌లో ఒక టమాట బాక్సును ఒక్క రోజులో రూ. 2,100కు అమ్మేశాడు. శుక్రవారం నాడు గయాకర్ మొత్తం 900 బాక్సులను విక్రయించాడు. దీంతో ఒక్క రోజులోనే 18 లక్షలు జేబులో వేసుకున్నాడు.

Also Read: అబుదాబిలో అడుగుపెట్టిన ప్రధాని మోడీ.. యూఏఈ అధ్యక్షుడితో భేటీ

పోయిన నెల కూడా టమాట నాణ్యతను ఆధారం చేసుకుని ఒక బాక్సును రూ. 1000 నుంచి రూ. 2,400 వరకు అమ్మగలిగాడు. 

పూణె జిల్లాలోని జున్నార్‌లో చాలా మంది టమాట రైతులు కోటీశ్వరులయ్యారు. ఇక్కడి కమిటీ టమాట విక్రయం ద్వారా నెల రోజుల్లో రూ. 80 కోట్ల వ్యాపారం చేసింది. ఈ వ్యాపారం ద్వారా అక్కడి ఏరియాలోని సుమారు 100 మంది మహిళలకు ఉపాధి కల్పించింది.

ఇలా టమాటలు అమ్మి లక్షాధికారులైన రైతులు కేవలం మహారాష్ట్రలోనే లేరు. కర్ణాటకలోనూ ఉన్నారు. కోలార్‌కు చెందిన ఓ రైతు కుటుంబం ఈ మధ్యే టమాట బాక్సును రూ. 2000 చొప్పున అమ్మి రూ. 38 లక్షలతో ఇంటికి తిరిగి వెళ్లింది.

click me!