
Maharashtra crisis: రాజకీయ సంక్షోభం నాలుగో రోజుకు చేరుకోగా, తిరుగుబాటుదారుడైన శివసేన మంత్రి ఏక్‌నాథ్ షిండే శుక్రవారం నాడు దాదాపు 12 మంది స్వతంత్రులు మరియు చిన్న పార్టీలతో పాటు 40 మందికి పైగా ఎమ్మెల్యేల మద్దతు తమకు ఉందని ప్రకటించారు. గౌహతి నుండి మీడియాతో మాట్లాడుతూ.. తిరుగుబాటు శాసనసభ్యులు తమ బలాన్ని నిరూపించుకోవడానికి గవర్నర్ లేదా శాసనసభ ముందు ముంబైకి రావాల్సి ఉంటుందని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ జారీ చేసిన హెచ్చరికను కూడా షిండే తోసిపుచ్చారు. "మేము అలాంటి బెదిరింపులకు భయపడము… మేము ఏమి చేస్తున్నామో అది ఖచ్చితంగా చట్టబద్ధమైనది. ఎమ్మెల్యేలందరూ స్వచ్ఛందంగా మాతో చేరారని వారి అఫిడవిట్‌లు మా వద్ద ఉన్నాయి. మెజారిటీ సంఖ్యలు మా వద్ద ఉన్నాయి.. 40 మందికి పైగా సేన ఎమ్మెల్యేలు మరియు 12 మంది స్వతంత్రులు మరియు ఇతరులు తమతో ఉన్నారు” అని ఏక్‌నాథ్ షిండే నొక్కిచెప్పారు.
ఈ క్రమంలోనే తాము పార్టీ మారబోమని, కొత్త పార్టీ పెట్టబోమని శివసేన రెబల్ నాయకుడు ఏక్ నాథ్ షిండే స్పష్టం చేశారు. తామే బాలాసాహెబ్ ఠాక్రే అసలైన శివ సైనికులమని అన్నారు. ప్రభుత్వ ఏర్పాటుపై తమతో కలిసి వున్నవారిపై త్వరలోనే చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరతామని తన మద్దతుదారులకు చెప్పిన ఒక రోజు తర్వాత, విడిపోయిన గ్రూప్ నాయకుడు శుక్రవారం గౌహతిలో బీజేపీ నాయకులను కలవడాన్ని ఖండించారు. మూడు కూటమి భాగస్వాములు చివరి వరకు కలిసి ఉండాలని నిర్ణయించుకున్నందున 30 నెలల మహా వికాస్ అఘాడి (ఎంవిఎ)ని పడగొట్టడానికి బీజేపీ తిరుగుబాటును ప్రేరేపించిందని శివసేన-ఎన్‌సీపీ-కాంగ్రెస్ ఆరోపించాయి. రాష్ట్ర కాంగ్రెస్ మంత్రి డాక్టర్.నితిన్ రౌత్ శుక్రవారం నాడు శివసేన శ్రేణులలో తిరుగుబాటును ఇంజినీరింగ్ చేయడం ద్వారా బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది అని ఆరోపించారు.
కాగా ఏక్ నాథ్ షిండే క్యాంప్ లో ఉన్న ఎమ్మెల్యేలలో 12 మంది పై అనర్హత వేటు వేయాలని శివసేన ప్రయత్నిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే వీటిపై ఏక్‌నాథ్ షిండే నుండి ఘాటైన స్పందన వచ్చింది. తన వర్గాన్ని నిజమైన శివసేనగా అభివర్ణిస్తూ.. తాము ఎవరి బెదిరింపులకు భయపడమని తేల్చి చెప్పాడు. వరుసగా ట్వీట్లు చేస్తూ.. ‘‘ఎవరిని భయపెట్టాలని చూస్తున్నారు? మీ వ్యూహాలు ఏంటో, చట్టం ఏంటో మాకు తెలుసు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం.. విప్ పవర్ కేవలం అసెంబ్లీ వ్యవహారాలకు మాత్రమే వర్తిస్తుంది. సమావేశాలకు వర్తించదు. ఈ విషయంలో సుప్రీంకోర్టు అనేక తీర్పులు ఇచ్చింది ’’ అంటూ ట్వీట్ చేశారు.
ఇదిలావుండగా, మహారాష్ట్ర రాజకీయాలపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తన పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. రాష్ట్ర పరిస్థితులపై చర్చించారు. సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రులుగా కొనసాగిన సొంత వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఏక్‌నాథ్ షిండేతో పాటు ముగ్గురు మంత్రులు, రెండు డజన్ల మంది ఎమ్మెల్యేలు ముంబయిని విడచి సూరత్ వెళ్తున్న విషయం గురించి సీఎంవో వద్ద కూడా సమాచారం లేదా? అంటూ సొంత నేతలను ప్రశ్నించినట్టు తెలిసింది.